TTD: వైభవంగా శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు; విశేషాలివే!!
కలియుగ ప్రత్యక్ష దైవం, శేషాచల కొండలపై కొలువుతీరిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలతో పాటు, విశేష వేడుకలు జరుగుతున్నాయి. తిరుమల శ్రీవారికి అనుబంధంగా ఉన్న అనేక ఆలయాలలోనూ బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. తిరుపతి శేషాచల పర్వత మూలంలో వెలసిన కపిలేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు మార్చి 1వతేదీ నుండి 10వ తేదీవరకు అత్యంత వైభవోపేతంగా జరగనున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలకు ఫిబ్రవరి 29వ తేదీన శాస్త్రోక్తంగా అంకురార్పణ జరగనుంది.
బ్రహ్మోత్సవాల సందర్భంగా కపిలేశ్వర స్వామి వారికి ఉదయం ప్రతిరోజు 7 గంటల నుండి 9 గంటల వరకు, అలాగే రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు వాహన సేవలు జరగనున్నాయి. ఇక బ్రహ్మోత్సవాలు విశేషాల వివరాల్లోకి వెళితే మార్చి ఒకటవ తేదీన ఉదయం ధ్వజారోహణం జరుగుతుంది. రాత్రి స్వామివారు హంస వాహనంపై ఊరేగుతారు.

మార్చి రెండవ తేదీన ఉదయం సూర్యప్రభ వాహనంపై, రాత్రి చంద్రప్రభ వాహనంపై భక్తులకు దర్శనం ఇస్తారు. మార్చి 3వ తేదీన ఉదయం భూత వాహనంపై, రాత్రి సింహ వాహనంపై స్వామి ప్రజలను కరుణిస్తారు. మార్చి 4వ తేదీన ఉదయం మకర వాహనంపై, రాత్రి శేష వాహనంపై స్వామివారు విహరిస్తారు.
మార్చి 5వ తేదీన తిరుచ్చి ఉత్సవం జరుగుతుంది. అధికార నంది వాహనం పైన స్వామి కనువిందు చేస్తారు. మార్చి ఆరవ తేదీన ఉదయం వ్యాఘ్ర వాహనంపై, గజ వాహనంపై స్వామివారు ఊరేగుతారు. మార్చి 7వ తేదీన ఉదయం కల్పవృక్ష వాహనం, రాత్రి అశ్వవాహనంపై స్వామివారు భక్తులకు దర్శనం ఇస్తారు. మార్చి 8వ తేదీన ఉదయం రథోత్సవం భోగి తేరు జరగనుండగా, అదే రోజు రాత్రి నంది వాహనంపై స్వామి ఊరేగుతారు.
మార్చి 9వ తేదీన ఉదయం పురుషామృగవాహనంపై ఊరేగే స్వామికి, సాయంత్రం కళ్యాణోత్సవం నిర్వహిస్తారు. ఆపై రాత్రి తిరుచ్చి ఉత్సవం అత్యంత ఘనంగా జరుగుతుంది. మార్చి 10వ తేదీ ఉదయం త్రిశూల స్నానం మరియు యంత్రం ధ్వజావరోహణం, రాత్రి రావణాసురుని సంహారం నిర్వహిస్తారు.
ఇక కపిలేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ప్రతిరోజు విభిన్న కార్యక్రమాలను నిర్వహించనున్నారు. కోలాటాలు, భజన కార్యక్రమాలతో పాటు, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు అన్నమాచార్య సంకీర్తనలను ఆలపించి బ్రహ్మోత్సవాలలో భక్తి భావాన్ని నింపనున్నారు.












Click it and Unblock the Notifications