తిరుమల శ్రీవారి భక్తుల చేతికి కర్రలు.. కాలినడక మార్గంలో రెండు చిరుతలు
తిరుపతి: తిరుమల శేషాచలం అడవుల్లో చిరుతలు, ఇతర వణ్య ప్రాణుల సంఖ్య భారీగా పెరిగడం, వాటి కదలికలు, సంచారం అధికమైన నేపథ్యంలో టీటీడీ అధికారులు పలు నిర్ణయాలను తీసుకున్నారు. భక్తుల రక్షణ కోసం తక్షణ చర్యలను చేపట్టారు. యుద్ధ ప్రాతిపదికన వాటిని అమల్లోకి తీసుకొచ్చారు.
ఇదివరకు తిరుమల, శేషాచలం అటవీ ప్రాంతంలో భక్తులకు చిరుతలు, ఎలుగుబంట్లు కనిపించిన విషయం తెలిసిందే. తిరుమల నడక దారిలో కిందటి నెల చిరుత దాడి చేయడంతో లక్షిత అనే బాలిక మరణించింది. ఆ బాలిక స్వస్థలం నెల్లూరు జిల్లా కోవూరు మండలం పోతిరెడ్డిపాలెం.

తల్లిదండ్రులు దినేష్ శశికళతో కలిసి అలిపిరి మెట్ల మార్గంలో శ్రీవారి దర్శనానికి బయలుదేరగా.. లక్ష్మీనరసింహ స్వామి ఆలయం వద్ద చిరుత చిన్నారిపై దాడి చేసింది. ఈ ఘటన తరువాత తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. భక్తులపై వన్యప్రాణులు దాడి చేయకుండా చర్యలు చేపట్టింది.
అలిపిరి నుంచి గాలిగోపురం, శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయం, 38వ మలుపు ప్రాంతాలతో పాటు మొత్తం అయిదు చోట్ల చిరుతల సంచారాన్ని గుర్తించారు. వాటి కదలికలను పసిగట్టడానికి అలిపిరి మార్గంలో గాలి గోపురం నుంచి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వరకు సుమారు 500 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వాటిని అమర్చే ప్రక్రియను చేపట్టారు.
అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గంలో తిరుమలకు కాలి నడకన వెళ్లే భక్తులకు చేతి కర్రల పంపిణీని చేపట్టారు. ఒక్కో భక్తుడికి ఒకటి చొప్పున చేతి కర్రలను టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పంపిణీ చేశారు. భక్తులకు చాలినన్ని ఊతకర్రలను ఇదివరకే సేకరించారు. అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గంలో పెద్ద ఎత్తున భద్రత సిబ్బందిని మోహరింపజేశారు.

టీటీడీ దాదాపు 10,000 కర్రలను కొనుగోలు చేసింది. ఈ కర్రలను తిరుమలకు బయలుదేరే ముందు భక్తులకు అందజేస్తారు. నరసింహ స్వామి ఆలయం దాటిన తరువాత వాటిని మళ్లీ టీటీడీ సిబ్బందికి అందజేయాల్సి ఉంటుంది. చేతికర్రల పంపిణీ సందర్భంగా భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడారు. ఈ కర్రలు కాలినడకన వెళ్లే భక్తులకు ధైర్యాన్ని ఇస్తాయని వ్యాఖ్యానించారు.
కర్రలు చేతిలో ఉన్న వారిపై దాడి చేయడానికి వన్యప్రాణులు వెనుకాడతాయనే విషయం శాస్త్రీయంగా రుజువయిందని భూమన అన్నారు. నిపుణుల సూచనల మేరకే కర్రల పంపిణీ చేపట్టామని చెప్పారు. పాదచారుల మార్గంలో మరో రెండు చిరుతపులులు ఉన్నట్లు గుర్తించామని, వాటిని బంధించడానికి ప్రయత్నిస్తున్నామని టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు.












Click it and Unblock the Notifications