TTD: స్వామివారి ఆశీస్సులు లభిస్తాయా, గుర్తించండి - వీఐపీల దర్శనాలపై భూమన..!!
Tirumala: టీటీడీ నూతన ఛైర్మన్ గా భూమన కరుణాకర రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఆ వెంటనే తన ప్రాధాన్యతలను స్పష్టం చేసారు. సామాన్య భక్తులకు స్వామివారి దర్శనం చేయించడానికే ప్రాధాన్యత ఇస్తానని, ధనవంతుల సేవలో తరించేవాడిని కాదని భూమన వెల్లడించారు. ధనవంతులు, విఐపిలు దర్శనాల గురించి తాపత్రయపడితే స్వామివారి ఆశీస్సులు లభించవనే వాస్తవం గుర్తించాలని కరుణాకర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
సామాన్య భక్తులకే ప్రాధాన్యత
శ్రీ వేంకటేశ్వర స్వామివారి దయ, ఆశీస్సులతో ఊహించని విధంగా తనకు రెండవ సారి టీటీడీ చైర్మన్ గా పనిచేసే మహద్భాగ్యం దక్కిందన్నారు. ఇంతటి అదృష్టం ఇచ్చిన స్వామివారికి, మరోసారి పనిచేసే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

2006 నుండి 2008 వరకు టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులుగా పని చేసిన సమయంలో ఒక వైపు సనాతన హిందూ ధర్మాన్ని దేశవ్యాప్తంగా విస్తృత ప్రచారం చేస్తూనే, సామాన్య భక్తులకు అవసరమైన వసతుల కల్పనకు అనేక నిర్ణయాలు తీసుకుని అమలు చేశామన్నారు. మరోవైపు సామాజిక సేవా కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున నిర్వహించినట్టు చెప్పారు.
క్షణకాలమైన దర్శనం చేసుకోవాలి
గతంలో తాను ఛైర్మన్‌గా పనిచేసిన హయాంలో సామాన్య భక్తులకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చేలా ఆచరణలో చేసి చూపామన్నారు. స్వామివారి వైభవాన్ని ప్రజల హృదయాల్లో తీర్చిదిద్దేలా వారిలో ఆధ్యాత్మిక వెలుగులు నింపుతామని చెప్పారు. హోదా, అధికారం, తాము ముఖ్యలమనే భావనతో దేవుడి దగ్గరికి వచ్చేవారిని ఆయన క్షణకాలమైనా చూడకపోతే ఉపయోగం లేదన్నారు.
దేశవిదేశాల్లోని హిందువులందరినీ ఏకతాటిపైకి తెచ్చి హిందూ ధర్మాన్ని ప్రచారం చేసేలా టీటీడీ నాయకత్వం వహిస్తుందని చెప్పారు. తాను స్వామివారి సేవకులకు సేవకునిగా పనిచేస్తానని, అధికారం కోసం కాదని అన్నారు. స్వామివారిని భక్తుల దగ్గరికే తీసుకెళ్లి భక్తిప్రసాదం పంచుతామన్నారు.
తిరుమలలో ప్రతీ అడుగు పవిత్రమే
తొలి సారి ఛైర్మన్ గా తీసుకున్న నిర్ణయాలను గుర్తు చేసారు. కళ్యాణమస్తు, దళిత గోవిందం,భగవంతున్నే భక్తుల దగ్గరికి తీసుకుని వెళ్ళి ఆశీస్సులు అందించేలా శ్రీనివాస కళ్యాణాలు పెద్ద ఎత్తున నిర్వహించినట్టు చెప్పారు. దర్శనంతో సంబంధం లేకుండా కొండ మీదకు వచ్చిన ప్రతి భక్తుడు రెండు పూటల కడుపు నిండా భోజనం చేసే అవకాశం కల్పించామన్నారు.

తిరుమల ఆలయ పవిత్రతను కాపాడటానికి నాలుగుమాడ వీధుల్లో పాదరక్షలతో ప్రవేశాన్ని నిషేధించినట్టు తెలిపారు. తిరుమల కొండ మొత్తం శ్రీవారి నిలయమేనని..ప్రతీ అడుగు పవిత్రత కలిగిన ప్రాంతమని వివరించారు. శ్రీవారిని ఎంత సేపు దర్శించాము అనే దాని కంటే..శ్రీవారి ఆశీస్సులు అందేలా దర్శించుకోవటమే ముఖ్యమని భూమన వివరించారు.












Click it and Unblock the Notifications