గతంలో కంటే బాగున్నాయ్..!!
Tirumala: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. 10 రోజుల వైకుంఠ ద్వార దర్శనం కోసం టోకెన్లు/టికెట్లు ఉన్న భక్తులు తిరుమలకు బారులు తీరుతున్నారు. శ్రీవేంకటేశ్వర స్వామివారిని ఉత్తరద్వారం గుండా దర్శించుకోవడానికి దేశం నలుమూలల నుంచి వేలసంఖ్యలో తరలి వస్తోన్నారు.
సోమవారం నాడు 74,800 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 17,726 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.48 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. భక్తులకు టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు అల్పాహారం, పాలు, మంచినీరు పంపిణీ చేశారు.

సంక్రాంతి పండగ వేడుకలను టీటీడీ పాలక మండలి ఛైర్మన్ బీఆర్ నాయుడు భక్తులతో కలిసి జరుపుకొన్నారు. తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రాన్ని సందర్శించారు. అక్కడే అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. భక్తులతో మాట్లాడారు. నాణ్యత గురించి అడిగి తెలుసుకున్నారు. నాణ్యత గతంలో కంటే ఇప్పుడు బాగుందని, నాణ్యత పెరిగిందని భక్తులు చెప్పారు.
ఈ సందర్భంగా వైకుంఠ ద్వార దర్శనం ఏర్పాట్ల గురించీ బీఆర్ నాయుడు ఆరా తీశారు. దర్శనానికి పట్టిన సమయం గురించి అడిగి తెలుసుకున్నారు. సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత ఇస్తోన్నామని ఆయన వివరించారు. భక్తుల ఇచ్చిన ఫీడ్ బ్యాక్ పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు. వాళ్లు ఇచ్చిన కొన్ని సూచనల గురించి అధికారులకు వివరించారు. క్షేత్రస్థాయిలో చిన్న చిన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు.
అన్న ప్రసాదాల నాణ్యతను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి ప్రముఖ ఆహార పదార్థాల తయారీ నిపుణులతో ఓ కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. సభ్యులు సూచించిన విధంగా భవనంలో సిబ్బందిని పెంచడం, వంటశాలల ఆధునీకరణ, మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణ, తదితర అంశాలను మరింత మెరుగుపర్చింది టీటీడీ.
అన్న ప్రసాదాలలో వినియోగించే ముడి సరుకుల నాణ్యతను మరింత పెంపొందించడానికి ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ ఆఫ్ ఇండియా సహకారంతో అత్యాధునిక ల్యాబొరేటరీని తిరుమలలో ఏర్పాటు చేయడానికీ చర్యలు తీసుకుంది. ఇటీవల తిరుమలలో ఫుడ్ సేఫ్టీ విభాగం ఏర్పాటు చేసిన మొబైల్ ల్యాబ్‌లో 80 రకాల పదార్థాలను పరీక్షించవచ్చు.












Click it and Unblock the Notifications