TTD: తిరుమలలో పోటెత్తిన భక్తులు.. సర్వదర్శనానికి 20గంటలు; వీఐపీ బ్రేక్ దర్శనంలో అమిత్ షా!!
ఏడుకొండలస్వామి... ఎక్కడున్నావయ్యా.. ఎన్ని మెట్లెక్కినా కాన రావేమయ్యా అంటూ పాడిన పాట ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లిన భక్తులు పాడుకుంటున్నారు. తిరుమల భక్తుల రద్దీ నేపథ్యంలో స్వామిని దర్శించుకోవడానికి క్యూలైన్లో వేచి చూస్తున్న భక్తులు పడిగాపులు పడుతున్నారు. తిరుమలలో భక్తుల రద్దీ మళ్లీ పెరగడంతో శ్రీవారి సర్వదర్శనానికి ఎస్ ఎస్ డీ టోకెన్లు లేకుండా వెళ్లినవారికి దర్శనం బాగా సమయం పడుతుందని టిటిడి తాజాగా వెల్లడించింది.
తిరుమలలో కిలోమీటర్ల మేర క్యూ లైన్లలో భక్తులు
వీకెండ్ కావడంతో, వేసవి సెలవులు రావడంతో స్వామిని దర్శించుకునే భక్తుల సంఖ్య విపరీతంగా పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్లు, నారాయణగిరి షెడ్లు, సర్వదర్శనం భక్తుల క్యూ లైన్ లతో నిండిపోయాయి. ఇక కొండపై భక్తుల క్యూ లైన్లు ఏకంగా రింగురోడ్డు శిలాతోరణం సర్కిల్ దాకా దాదాపు కిలోమీటర్ మేర కనిపిస్తున్నాయి. ప్రస్తుతం శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతుందని టిటిడి వెల్లడించింది.

నిన్న స్వామివారిని దర్శనం చేసుకున్న వారి డేటా ఇదే
కలియుగ దైవం.. తిరుమల వేంకటేశ్వరుడి సన్నిధిలో భక్తుల రద్దీ క్రమంగా పెరుగుతూ వస్తుంది. నిన్న స్వామివారిని 64,115 మంది భక్తులు దర్శించుకున్నారు. 32,711 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. రూ. 4.23 కోట్లు హుండీ కానుకలుగా వచ్చాయి. కంపార్ట్‌మెంట్లన్నీ నిండి బాట గంగమ్మ ఆలయం వరకు క్యూ లైన్లలో భక్తులు వేచి ఉన్నారు. SSD టోకెన్లు లేని భక్తుల సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోంది.
తిరుమలలో వసతి గృహాలకు ఇబ్బంది
300 రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్లు కొనుగోలు చేసిన భక్తులు శ్రీవారిని దర్శించుకోవడానికి నాలుగు గంటల సమయం పడుతుందని చెబుతున్నారు. అయితే ఈ సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా టిటిడి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కానీ తిరుమలకు వచ్చే భక్తులకు వసతి గృహాలు దొరకడం ఇబ్బందిగా మారింది. ఇక క్యూలైన్లలో దర్శనం కోసం వేచి చూస్తున్న వారికి ఆహారం, తాగునీరు, పాలు అందిస్తున్నారు.
వీఐపీ బ్రేక్ దర్శనంలో స్వామివారిని దర్శించుకున్న అమిత్ షా
ఈరోజు వేకువజామునే స్వామివారికి ఆర్జిత సేవలు, ఉదయం అభిషేకం, వీఐపీ బ్రేక్ దర్శనం ఉండడంతో, ముఖ్యంగా ఈ రోజు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్వామివారిని దర్శించుకుంటూ ఉండటంతో సామాన్య భక్తులకు దర్శనం మరికొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఈరోజు అమిత్ షా ఉదయం ఎనిమిది గంటల 30 నిమిషాలకు విఐపి బ్రేక్ దర్శనంలో తిరుమల శ్రీవారిని దర్శించుకుంటున్నారు.












Click it and Unblock the Notifications