ఆఫ్‌లైన్‌లో శ్రీవారి రూ.300 ప్రత్యేక దర్శనం టికెట్లు?: క్లారిటీ ఇచ్చిన ఈఓ: రీఫండ్‌పైనా
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. గురువారం నాడు 65,313 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. వారిలో 28,780 మంది తలనీలాలను సమర్పించారు. ఆ ఒక్కరోజే హుండీ ద్వారా 3.54 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. 26 కంపార్ట్‌మెంట్లల్లో భక్తులు వేచి ఉన్నారు.
సర్వదర్శనం టోకెన్లను పొందిన భక్తులకు స్వామివారి దర్శనానికి 12 గంటల సమయం పట్టింది. మున్ముందు భక్తుల రద్దీ మరింత పెరుగుతుందని టీడీపీ అధికారులు అంచనా వేస్తోన్నారు. దీనికి అనుగుణంగా టీటీడీ అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోన్నారు.

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవడానికి ఆఫ్ లైన్ ద్వారా కూడా 300 రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్లను జారీ చేయాలంటూ భక్తుల నుంచి అందుతోన్న విజ్ఞప్తులపై తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఏవీ ధర్మారెడ్డి స్పందించారు. దీనిపై స్పష్టత ఇచ్చారు.
ఆఫ్ లైన్ విధానంలో 300 రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్లను జారీ చేయడం వీలు కాదని ఈవో వివరించారు. ఆన్‌లైన్ విధానంలో ఈ టికెట్ల జారీ కొనసాగిస్తామని అన్నారు. టైమ్ స్లాట్ సర్వదర్శనం టోకెన్లను ఆఫ్ లైన్ ద్వారా జారీ చేస్తోన్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. 300 రూపాయల టికెట్ల రద్దుపైనా ఈఓ స్పష్టతను ఇచ్చారు. ఈ టికెట్లను రద్దు చేయడం, రీఫండ్ ఇవ్వడం సాధ్యం కాదని తేల్చి చెప్పారు.
తిరుమలకు వెళ్లే లక్షలాది మంది శ్రీవారి భక్తులు ఎదుర్కొంటోన్న ఇబ్బందులను తెలుసుకోవడానికి, వారి నుంచి సలహాలు, సూచనలను తీసుకోవడానికి తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఏవీ ధర్మారెడ్డి నిర్వహించిన డయల్ యువర్ ఈఓ కార్యక్రమంలో అందిన విజ్ఞప్తిపై ఆయన స్పందించారు.
ఈ కార్యక్రమంలో పలు అంశాలను భక్తులు ఈఓ దృష్టికి తీసుకొచ్చారు. శ్రీవారి సేవ కోట ఆన్‌లైన్ లో విడుదల అయిన వెంటనే అన్ని తేదీలు బ్లాక్ అవుతున్నాయని, అవి బఫరింగ్ అవుతున్నాయంటూ భక్తులు చేసిన ఫిర్యాదులపై ఈఓ మాట్లాడారు. శ్రీవారి సేవ ఆన్‌లైన్ దరఖాస్తులన్నీ కూడా పారదర్శకతతో రూపొందించామని వివరించారు. శ్రీవారి సేవకులు దళారులకు డబ్బులు ఇవ్వకూడదని విజ్ఞప్తి చేశారు.
శ్రీవారి దర్శనం టికెట్లు లభించినప్పటికీ వసతి గదులు ఆన్‌లైన్‌లో లభించట్లేదంటూ భక్తులు చేసిన ఫిర్యాదుకు బదులిచ్చారు. తిరుమలలో 7,500 గదులు ఉన్నాయని, అందులో 50 శాతం ఆన్‌లైన్‌లో అడ్వాన్స్ బుకింగ్ కోసం కేటాయిస్తున్నామని వివరించారు. ఆన్‌లైన్‌లో గదులు దొరకని భక్తులు తిరుమలలో సీఆర్‌ఓ ద్వారా వాటిని పొందవచ్చని చెప్పారు.












Click it and Unblock the Notifications