శ్రీవారి అన్నప్రసాదంలో 15 రకాల మెనూ: అదనపు వంటశాలలు: బ్రహ్మోత్సవాల ప్రత్యేకం
ఈ ఏడాది అధిక మాసం కారణంగా తిరుమలలో రెండు బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. సెప్టెంబర్ 15వ తేదీన సాలకట్ల బ్రహ్మోత్సాలు ఆరంభమౌతాయి. అక్టోబర్ లో వార్షిక బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో వీటికి సంబంధించిన ఏర్పాట్లపై తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు ముమ్మరం చేసింది. పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో వరుస సమీక్షలు, సమావేశాలను నిర్వహిస్తోంది.
తాజాగా టీటీడీ కార్యనిర్వహణాధికారి ముద్దాడ రవిచంద్ర.. తిరుమలలోని అన్నమయ్య భవన్ లో శ్రీవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి, జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బారాయుడుతో కలిసి ఆయన సమన్వయ సమావేశం నిర్వహించారు. ఓ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరాలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నాణ్యతలో రాజీ పడకుండా రుచికరమైన అన్న ప్రసాదాలను భక్తులకు పంపిణీ చేయాలని సూచించారు. ఈ ఏడాది బ్రహ్మోత్సవాలకు 10 లక్షల లడ్డూలను బఫర్ స్టాక్ గా పెట్టుకోవాలని ఈఓ చెప్పారు. గరుడ వాహనం రోజున అధిక మంది భక్తులకు దర్శనం కల్పించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
భక్తుల రద్దీకి తగిన విధంగా ఆర్టీసీ బస్సులను నడిపేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. స్వామివారికి నిస్వార్థంగా సేవలందించే శ్రీవారి సేవకులను గుర్తించి వారి సేవలను బ్రహ్మోత్సవాలకు వినియోగించుకోవాలని ముద్దాడ రవిచంద్ర చెప్పారు. అనంతరం అధికారులతో కలిసి శ్రీవారి ఆలయ నాలుగు మాడ వీధులను తనిఖీ చేశారు. బ్రహ్మోత్సవ ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా ఈఓ విలేకరులతో మాట్లాడారు. బ్రహ్మోత్సవాల కోసం ఇప్పటివరకు చేపట్టిన పనుల పురోగతిని సమీక్షించామని, మిగిలిన పనులను సెప్టెంబర్ 14లోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు వివరించారు. ఏటా తిరుమలకు పెరుగుతున్న వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతోందని, ఈ ఏడాది రథసప్తమి సందర్భంగా సుమారు 3.75 లక్షల మంది భక్తులు, 15,000 వాహనాలు తిరుమలకు వచ్చాయని గుర్తు చేశారు.
ఆ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని రాబోయే బ్రహ్మోత్సవాల్లో భక్తుల రద్దీపై ముందస్తు అంచనాలు రూపొందించినట్లు ఈఓ తెలిపారు. తిరుమల, తిరుపతి ప్రాంతాల్లో భక్తుల రద్దీ, వాహన ట్రాఫిక్ మేనేజ్‌మెంట్‌తో పాటు ఆరోగ్యం, పారిశుద్ధ్యం, అన్నప్రసాదం, ఘాట్‌రోడ్ల నిర్వహణ, అత్యవసర పరిస్థితుల నిర్వహణ తదితర అంశాలపై సమీక్షించినట్లు పేర్కొన్నారు. గరుడసేవకు అధిక ప్రాధాన్యత ఇస్తోన్నామని, తిరుమలతో పాటు తిరుపతిలోనూ భక్తుల రద్దీని క్రమబద్దీకరించడానికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించినట్లు చెప్పారు.
గత బ్రహ్మోత్సవాల్లో గరుడసేవ రోజున సుమారు 20 లక్షల ఫుడ్ పోర్షన్లతో పాటు 15 రకాల మెనూలను భక్తులకు అందించామని, ఈ ఏడాది కూడా దీన్ని కొనసాగించడంతో పాటు భక్తుల రద్దీకి అనుగుణంగా అదనంగా మరిన్ని వంటశాలల ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. నిత్యావసర సరుకుల సేకరణ, రవాణా ఏర్పాట్లు ముమ్మరంగా చేస్తామని ఆయన వివరించారు. భక్తులకు భద్రత కల్పించడంలో భాగంగా విపత్తు నిర్వహణ, ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్స్ లను మోహరింపజేస్తామని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications