కొత్త ఏడాది వేళ.. అమరావతివాసులకు టీటీడీ గుడ్ న్యూస్
TTD: వైకుంఠ ఏకాదశి పర్వదినం కోసం తిరుమల ముస్తాబవుతోంది. జనవరి 10 నుండి 19వ తేది వరకు శ్రీవారిని ఉత్తర ద్వారం గుండా దర్శించుకునే భాగ్యం లక్షలాది మంది భక్తులకు కలగబోతోంది. ఈ 10 రోజుల పాటు ఎనిమిది నుంచి తొమ్మిది లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకునే అవకాశం ఉన్నందున దీనికి అనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు ముమ్మరం చేస్తోంది.
ఈ పరిణామాల మధ్య రాజధాని అమరావతి పరిధిలో నిర్మితమైన శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని టీటీడీ కార్యనిర్వహణాధికారి జే శ్యామలరావు సందర్శించారు. రోజువారి వివరాలను ఆలయ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అమరావతి పరిధిలోని వెంకటపాలెంలో నిర్మితమైన ఆలయం ఇది.

2019లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 2022 జూన్ 9వ తేదీన ఈ ఆలయంలో మహా సంప్రోక్షణ కార్యక్రమం పూర్తయింది. అప్పటి గవర్నర్ బిశ్వభూషణ్ హరించందన్, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, విశాఖ శారద పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ఈ ఆలయం శిలాఫలాకాన్ని ఆవిష్కరించారు.
తాజాగా- ఈఓ శ్యామలరావు ఈ ఆలయాన్నని సందర్శించారు. ఆలయానికి సంబంధించి నిలిచిపోయిన అభివృద్ధి పనుల గురించి ఆరా తీశారు. నిర్మాణానికి సంబంధించిన వివరాలు, ఆలయంలో రోజువారి జరుగుతున్న కైంకర్యాలు, దాతల సహకారంతో ఇప్పటికే జరుగుతున్న అన్నదాన కార్యక్రమాలపై అధికారులు పూర్తిస్థాయి నివేదికను ఆయనకు అందజేశారు.
ఇక్కడ పని చేస్తోన్న టీటీడీ సిబ్బందికి అవసరమైన నివాస వసతి సముదాయాలు, అన్నదానానికి అవసరమైన భవనాలు, భక్తులు వేచి ఉండటానికి వీలుగా నిర్మించాల్సిన గదులు, స్వామివారి వాహనాల కోసం వాహన మండపం, గార్డెనింగ్ ఏర్పాటుకు కార్యాచరణ సిద్ధం చేయాలని ఈ సందర్భంగా శ్యామలరావు అధికారులను ఆదేశించారు.
ఆలయ నిర్మాణానికి ముందు తయారు చేసిన ప్లాన్ ప్రకారం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని టీటీడీ ఇంజినీరింగ్ విభాగం అధికారులను సూచించారు. జనవరి 1వ తేదీ, వైకుంఠ ఏకాదశి రద్దీ నేపథ్యంలో భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అన్నారు.












Click it and Unblock the Notifications