తిరుమల వసతి గదుల కేటాయింపులో మార్పులు?
Tirumala: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల తాకిడి నెలకొంది. మంగళవారం నాడు 71,824 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 28,462 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 4.01 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 16 కంపార్టుమెంట్లు నిండిపోయాయి. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పట్టింది. కంపార్ట్‌మెంట్లల్లో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది అన్నప్రసాదాలు, మజ్జిగ, మంచినీరు, అల్పాహారాన్ని పంపిణీ చేశారు. ఇదే రద్దీ ఇంకొంతకాలం పాటు కొనసాగుతుందని టీటీడీ అంచనా వేస్తోంది.

భక్తులకు కేటాయించే వసతి గదుల సౌకర్యాలపై టీటీడీ కార్యనిర్వహణాధికారి జే శ్యామలరావు సమీక్ష నిర్వహించారు. ఇందులో పారదర్శకత పాటించాలని ఆదేశించారు. వసతి గదుల కేటాయింపులో అనుసరిస్తోన్న విధానాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారుల ఈఓకు వివరించారు.
తిరుపతి ప్రధాన బస్టాండ్ సమీపంలో శ్రీనివాసం, రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణువాసం వసతి భవనాలు ఉన్నాయి. ఈ రెండు చోట్లా గదులను బుక్ చేసుకోవచ్చు. తిరుమలలో శ్రీ పద్మావతి అతిథిగృహం, శ్రీ వేంకటేశ్వర అతిథిగృహం, రామ్ బగీచా వరాహస్వామి విశ్రాంతి భవనం, ట్రావెలర్స్ బంగ్లా, నారాయణగిరి గెస్ట్ హౌస్, నందకం, పాంచజన్యం, కౌస్తుభం, వకుళమాత, సప్తగిరి వసతి గృహాలు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో ఆన్ లైన్ ద్వారా గదులను బుక్ చేసుకునే సౌకర్యం ఉంది.
కాషన్ డిపాజిట్ రీఫండ్, తిరుపతిలో అందుబాటులో ఉన్న వసతి గృహాలు, కొత్తగా నిర్మాణంలో ఉన్న పీఏసీలు, భక్తులను మోసానికి గురి చేస్తోన్న దళారులను గుర్తించడం, వారిని నియంత్రించడానికి చేపట్టాల్సిన చర్యలపై అంశాలపై శ్యామలరావు ఈ సమమావేశంలో సమీక్షించారు.
పదే పదే వసతి పొందుతున్న వారి వివరాలను శ్యామలరావు సేకరించారు. వారికి ఎలా వసతి లభిస్తోందనే విషయంపై ఆరా తీశారు. కొత్త వారికి అవకాశం లభించకపోవడం గురించి అడిగి తెలుసుకున్నారు. పదే పదే వసతిని పొందుతున్న వారిపై నిఘా ఉంచాలని సూచించారు. మరికొందరు గదులను సక్రమంగా ఖాళీ చేయకపోవడంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆయన ఆదేశించారు.












Click it and Unblock the Notifications