విష్ణు నివాసంలో టీటీడీ ఈఓ చేసిన ఆకస్మిక తనిఖీలో..?!
Tirumala: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠ ద్వార దర్శనం ఆదివారం నాటితో ముగిసింది. ఈ నేపథ్యంలో నేడు ఎలాంటి టోకెన్లు లేకపోయినప్పటికీ క్యూలైన్ ద్వారా భక్తులు శ్రీవారిని దర్శించుకోవడానికి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అనుమతులు ఇచ్చారు.
శనివారం నాడు 75,931 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 25,717 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.40 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. భక్తులకు టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు అల్పాహారం, పాలు, మంచినీరు పంపిణీ చేశారు.

కాగా- టీటీడీ కార్యనిర్వహణాధికారి జే శ్యామలరావు, జాయింట్ ఈఓ వీరభద్రం శ్రీవేంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (స్విమ్స్), భక్తుల వసతి గృహం విష్ణు నివాసంలల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ముందుగా స్విమ్స్ ఆసుపత్రి తనిఖీలు చేపట్టారు. రాత్రిపూట విధి నిర్వహణలో ఉండే డాక్టర్లు, సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించారు.
స్విమ్స్ వార్డుల్లో ఆయా షిఫ్ట్‌లలో విధుల్లో ఉన్న డాక్టర్లు, సిబ్బంది వివరాలను సూచిక బోర్డుల్లో తప్పనిసరిగా పొందుపరచాలని అధికారులను ఆదేశించారు. ఆసుపత్రి లోపల, బయట పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు.
చికిత్స పొందుతున్న రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. వైద్య సేవలు, భోజన సౌకర్యాలపై ఆరా తీశారు. ఆయా సేవల పట్ల రోగులు సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం స్విమ్స్‌లోని అత్యవసర సేవల విభాగం, నెఫ్రాలజీ వార్డు, ఐసియు, సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, కార్డియాలజీ, ఆర్ఐసియు తదితర వార్డులను శ్యామలరావు పరిశీలించారు.
అనంతరం తిరుపతి రైల్వే స్టేషన్ సమీపంలోని శ్రీవారి భక్తుల వసతి సముదాయం విష్ణు నివాసానికి చేరుకున్నారు. అక్కడ భక్తులకు అందుతున్న వసతి సదుపాయం, తదితర సౌకర్యాలను పరిశీలించారు. విష్ణు నివాసంలో గదుల కొరత కారణంగా హాలు, సెల్లార్‌లల్లో ఉంటోన్న భక్తులతో ఈవో మాట్లాడారు.
సుదూర ప్రాంతాల నుండి శ్రీవారి దర్శనం కోసం వచ్చామని, సర్వదర్శనం టోకెన్లు పూర్తి అయిన నేపథ్యంలో తిరుమలలోని క్యూలైన్ల ద్వారా వెళ్లి దర్శనం చేసుకునేందుకు వెళ్తున్నామని వాళ్లు ఈవోకు వివరించారు. సోమవారం తిరుమలలో క్యూలైన్లలోకి నేరుగా వెళ్లి శ్రీవారిని దర్శించుకునే అవకాశం కల్పించామని ఈవో భక్తులకు తెలియజేశారు.
విష్ణు నివాసంలో శ్రీవారి దర్శనానికి సంబంధించిన సమాచారంపై నిరంతరం ప్రకటనలు ఇస్తున్నారని తెలిపారు. సోమవారం రోజున తిరుమల క్యూలైన్లులోకి నేరుగా వెళ్లి శ్రీవారి దర్శనం చేసుకోవచ్చనే సమాచారాన్ని భక్తులకు నిరంతరం చేరవేసేలా మైకులు ద్వారా ప్రకటనలు ఇవ్వాలని ఈవో అధికారులను ఆదేశించారు.












Click it and Unblock the Notifications