TTD: శ్రీవారి భక్తులకు శుభవార్త: తిరుమల 108 తీర్థాలలో ఇకపై!!
తిరుమల శ్రీవారి భక్తులకు టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి శుభవార్త చెప్పారు. తిరుమలతో పాటు, తిరుమల తరహాలో తిరుపతిని కూడా ఆధ్యాత్మిక క్షేత్రంగా అభివృద్ధి చేస్తామని భూమన కరుణాకర్ రెడ్డి వెల్లడించారు. తిరుమలలో అన్యమత ప్రచారం జరగకుండా, మతాంతీకరణలను అడ్డుకునేందుకు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తామని ఆయన తెలిపారు.
తిరుమలలో నిర్వహించిన మూడు రోజుల ధార్మిక సదస్సు ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ధార్మిక సదస్సు తీర్మానాలను మీడియాకు వెల్లడిస్తూ కీలక అంశాలను పేర్కొన్నారు. తిరుమలలో ఉన్న 108 తీర్థాలను భక్తులు సందర్శించేలా ఏర్పాటు చేస్తామని, శిథిలావస్థలో ఉన్న ఆలయాలను పునరుద్ధరణ చేస్తామని, బడుగు బలహీన వర్గాల కోసం నూతన ఆలయాలను నిర్మిస్తామని తెలిపారు.

తిరుమల చేరుకోవాలంటే యాత్రికులు అందరూ తప్పనిసరిగా తిరుపతికి రావాల్సిందేనని, కనుక యాత్రికులకు తిరుమలలో లానే తిరుపతిలో కూడా సంపూర్ణమైన ఆధ్యాత్మిక వాతావరణాన్ని భక్తి భావనను కలిగించేలా తిరుపతి రూపురేఖలు మారుస్తామని, ఈ మేరకు సదస్సులో తీర్మానం చేయడం జరిగిందని పేర్కొన్నారు. హిందూమతంలో చేరాలనుకునేవారికి పవిత్రజల సంప్రోక్షణ ప్రక్రియ నిర్వహిస్తామన్నారు.
స్వచ్ఛందంగా హిందూ మతంలోకి మారడానికి ఇష్టపడే వారికోసం ఒక ప్రాంగణాన్ని ఏర్పాటు చేసి పవిత్ర జల ప్రోక్షణ తర్వాత ఒకసారి వారికి స్వామి వారి దర్శనం కల్పించాలని సదస్సులో తీర్మానం చేసినట్టు పేర్కొన్నారు. హైందవ ధర్మాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్లేలా విస్తృత ప్రచారం చేస్తామని, అందుకు కావలసిన ప్రవచన కర్తలకు శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు.
టీటీడీ శ్రీవాణి ట్రస్టు ద్వారా హరిజన, గిరిజన, మత్స్యకార ప్రాంతాలలో 3600 ఆలయాల నిర్మాణం చేపట్టిందని వెల్లడించారు. గో సంరక్షణ అత్యవసర చర్యగా సదస్సులో తీర్మానించారని తెలిపారు. తిరుమల తిరుపతి సప్తగిరులను సంరక్షించాలని, ఎన్నో అరుదైన వృక్ష జంతు జాతులకు ఆశ్రయమైన తిరుమల గిరులను, తిరుమలలోని వేలాది తీర్థాలను జాగ్రత్తగా పరిరక్షించాలని నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు.
తిరుమలలో అనేక ప్రాజెక్ట్ ల ద్వారా ఆధ్యాత్మిక, ధార్మిక ప్రచారానికి శ్రీకారం చుట్టామని, భక్తి సంకీర్తనలకు కూడా ప్రాచుర్యం కల్పిస్తున్నామని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు. ధార్మిక సదస్సులో పీఠాధిపతులు, మఠాధిపతులు చేసిన తీర్మానాల అమలుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications