TTD: కొండంత రద్దీ, టీటీడీ సూచన - సర్వదర్శనం టోకెన్ల రద్దు..!!
Tirumala: తిరుమల కొండ భక్తులతో నిండి పోయింది. పెరటాసి శనివారాలు, వరుస సెలవుల కారణంగా ఆధిక రద్దీ దృష్ట్యా, టీటీడీ ఎస్ ఎస్ డి టోకెన్ల జారీని రద్దు చేసింది.పవిత్రమైన పెరటాసి మాసంలో రెండవ శనివారంతో పాటు అక్టోబర్ 2వ తేదీ వరకు వరుస సెలవులు ఉండడంతో తిరుపతి, తిరుమలకు వెళ్లే రహదారులన్నీ భక్తులతో రద్దీగా మారాయి. క్యూ లైన్లు నందకం విశ్రాంతి భవనం దాటి ఐదు కిలోమీటర్లకు పైగా విస్తరించాయి.
భక్తుల రద్దీ: తిరుమలలో రద్దీ కొనసాగుతోంది. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతిలో అక్టోబర్ 1, 7, 8, 14 మరియు 15వ తేదీలలో ఎస్ ఎస్ డి టోకెన్లు జారీ చేయటం లేదని టీటీడీ ప్రకటించింది. అలిపిరి నుండి ఎస్వీ వేద విశ్వవిద్యాలయం వరకు తమిళనాడు రాష్ట్రం నుండి వచ్చిన బస్సులతో నిలిచి ఉన్నాయి.

శుక్రవారం నుంచి అలిపిరి రహదారికి ఇరువైపులా బస్సులు బారులు తీరాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1 మరియు 2, నారాయణగిరి షెడ్‌లలోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోయి, క్యూ లైన్లు నందకం విశ్రాంతి భవనం దాటి ఐదు కిలోమీటర్లకు పైగా విస్తరించాయి. భక్తుల రద్దీకి అనుగుణంగా టీటీడీ ప్రత్యేక దృష్టి సారించి విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టింది.
టీటీడీ సూచనలు: దాదాపు 2500 మంది శ్రీవారి సేవకులు నిరంతరాయంగా భక్తులకు సేవలు అందిస్తున్నారు. వైకుంఠం కంపార్ట్‌మెంట్లు, నారాయణగిరి షెడ్లు, బయట క్యూ లైన్లు, లగేజీ కౌంటర్లు, లడ్డూ కౌంటర్లు, అన్నప్రసాదం, రిసెప్షన్, కల్యాణకట్ట, ఆలయంలోపల క్యూ లైన్ల నిర్వహణ, చెప్పల్ స్టాండ్‌లు మొదలైన వాటి వద్ద వివిధ షిఫ్టుల్లో సేవలందిస్తున్నారు. వివిధ శాఖలు యాత్రికుల పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ వేచి ఉన్న యాత్రికులకు సౌకర్యాలు కల్పిస్తున్నాయి.
సెప్టెంబర్ 30వ తేదీ నాటికి శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనానికి టోకెన్ లేని భక్తులకు దాదాపు 48 గంటల సమయం పడుతోంది. దర్శనం కోసం ఎక్కువ సమయం వేచి ఉండవలసి వస్తోంది. కావున ఈ దర్శన సమయాన్ని దృష్టిలో ఉంచుకుని భక్తులు తమ తీర్థయాత్రను రూపొందించుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.

టీటీడీ నిర్ణయాలు: కాలినడక మార్గంలో గతంలో విధించిన ఆంక్షల విషయంలోనూ టీటీడీ తాజాగా నిర్ణయం తీసుకుంది. అలిపిరి కాలినడక మార్గంలో చిరుతల సంచారం నేపథ్యంలో భక్తుల భద్రత దృష్ట్యా సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ద్విచక్ర వాహనాల రాకపోకలను టీటీడీ నిలిపివేసింది.
టీటీడీ అటవీశాఖతో అధికారులతోపాటు రాష్ట్ర అటవీశాఖ అధికారులు ఆ ప్రాంతంలో ఆరు చిరుతలను బంధించడంతో పాటు వారం రోజుల పాటు పూర్తిగా పరిశీలించిన తర్వాత ఎలాంటి ముప్పు లేదని నిర్ధారణకు వచ్చారు. దీంతో ఘాట్ రోడ్లలో రాత్రి 10 గంటల వరకు ద్విచక్ర వాహనాలను అనుమతిస్తున్నారు. ఇక, ఈ నెలలో వరుస సెలవులు..బ్రహ్మోత్సవాలతో రద్దీ మరింతగా ఉండే అవకాశం ఉందని టీటీడీ అంచనా వేస్తోంది.












Click it and Unblock the Notifications