TTD: మే నెలలో తిరుమలలో జరిగే విశేష ఉత్సవాలు, హిందూ పండుగలు
హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతీ నెలకు ఒక ప్రత్యేకత ఉంటుంది. ఏ మాసానికి ఆ మాసానిదే ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. అలాగే మే నెలకు కూడా ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. మే నెలలో ముఖ్యమైన హిందువులు జరుపుకునే పండుగలు, అలాగే తిరుమలలో జరిగే విశేష ఉత్సవాలను ఇక్కడ తెలుసుకుందాం. మే నెలలో జరిగే విశేష ఉత్సవాలను, వివిధ పండుగలను టీటీడీ ప్రకటించింది.
మేలో టీటీడీ విశేష ఉత్సవాలు
మే నెలలో వచ్చే పండుగల విషయానికి వస్తే మే 3న శ్రీ భాష్యకర్ ఉత్సవ ప్రారంభం జరగబోతుంది. తిరుమలలోని శ్రీవారి ఆలయంలో మే 3 నుంచి 21 వరకు భాష్యకారుల ఉత్సవం జరగనుంది. ఈ పండుగ సందర్భంగా 19 రోజుల పాటు ఉభయ నైవేద్యాలు రెండూ జరుగుతాయి. మే 4వ తేదీన సర్వ ఏకాదశి ఉత్సవం జరగనుంది.

అక్షయ తృతీయ, శ్రీ పద్మావతి పరిణయోత్సవం
మే 10వ తేదీన హిందువుల అత్యంత ప్రత్యేకంగా చూసే అక్షయ తృతీయ పండుగ తిరుమల వేదికగా జరగనుంది. మే 12వ తేదీన శ్రీ భాష్యకర సత్తుమొర, శ్రీ రామానుజ జయంతి, శ్రీ శంకర జయంతి వేడుకలు జరగనున్నాయి. మే 17వ తేదీ నుండి 19వ తేదీ వరకు శ్రీ పద్మావతి పరిణయోత్సవం అత్యంత ఘనంగా, అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు.
శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు
తిరుచానూరు ఆలయంలో మూడు రోజుల వార్షిక వసంతోత్సవాలు మే 24వ తేదీ వరకు శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు ఘనంగా జరగనున్నాయి. 21వ తేదీన అంకురార్పణతో ఉత్సవాలు ప్రారంభం కానుండగా ఉత్సవాల్లో భాగంగా మే 23వ తేదీ ఉదయం 7.45గంటలకు స్వర్ణ రథోత్సవం నిర్వహించనున్నారు. వసంతోత్సవాలు జరిగే మూడు రోజులు మధ్యాహ్నం 2.30 నుండి సాయంత్రం 4.30 గంటల వరకు శుక్రవారపు తోటలో అమ్మవారి ఉత్సవాలకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు.
తిరుమల స్వామి భక్తుల జయంతి వేడుకలు
రాత్రి 7.30 నుండి 8.30 గంటల వరకు ఆలయ నాలుగు మాడ వీధుల్లో అమ్మవారు విహరించి భక్తులను కటాక్షించనున్నారు. మే 22వ తేదీ నరసింహ జయంతి మరియు తరిగొండ వెంగమాంబ జయంతిని తిరుమలలో నిర్వహించనున్నారు. మే 23వ తేదీన అన్నమాచార్య జయంతిని, కూర్మ జయంతిని నిర్వహించనున్నారు. ఇదిలా ఉంటే వేసవి సెలవులు కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ కాస్త పెరిగింది.












Click it and Unblock the Notifications