శ్రీవారి భక్తులకు మరో సూపర్ ఫెసిలిటీ.. తిరుమలలో స్మార్ట్ బస్టాప్‌ల నిర్మాణం!
తిరుమల గిరులపై భక్తుల రాకపోకలు మరింత సులభంగా, సౌకర్యవంతంగా మారనున్నాయి. ఉచిత ధర్మరథం బస్సులు ఆగే చోట్ల స్మార్ట్ బస్టాప్‌లు నిర్మించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ కార్యక్రమానికి రేమండ్స్ సంస్థ ముందుకు వచ్చి సహకారం అందించనుంది.ప్రస్తుతం తిరుమలలో ధర్మరథం బస్సులు ఆగే 21 పాయింట్లు ఉన్నాయి.
వీటిలో ఐదు షెల్టర్లను ఆధునికీకరించి, మిగిలిన 16 చోట్ల కొత్తగా స్మార్ట్ బస్టాప్‌లు నిర్మించనున్నారు. మూడు దశల్లో ఈ పనులు జరుగుతాయి. మొదటి దశలో రాంభగీచా, లేపాక్షి కూడలి సమీపంలోని బస్టాప్‌లతో పాటు మరో ఒకటిని పెద్దగా, ఆధునికంగా తీర్చిదిద్దనున్నారు. తర్వాతి దశల్లో మిగిలినవి పూర్తి చేస్తారు.టీటీడీ ఇంజినీరింగ్ విభాగం ఇప్పటికే ఒక ఏఐ ఆధారిత స్మార్ట్ బస్టాప్ నమూనాను రూపొందించి రేమండ్స్ సంస్థకు పంపింది.

ఈ కొత్త బస్టాప్‌లు కేవలం షెల్టర్లు మాత్రమే కాదు. భక్తులు ఎండ, వర్షం, చలి నుంచి రక్షణ పొందేలా నిర్మిస్తారు. ప్రతి బస్టాప్‌లో డిజిటల్ డిస్‌ప్లేలు, సీసీ కెమెరాలు, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, అత్యవసర సమయాల్లో ఉపయోగించుకునే ఎస్‌ఓఎస్ బటన్ వంటి సౌకర్యాలు ఉంటాయి. భక్తులకు అత్యంత ఉపయోగకరమైన అంశం క్యూఆర్ కోడ్ సౌకర్యం. ప్రతి బస్టాప్ వద్ద స్మార్ట్ క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేస్తారు.
భక్తులు తమ మొబైల్ ఫోన్‌తో ఆ కోడ్‌ను స్కాన్ చేస్తే చాలు. వెంకటాద్రి యాప్ ద్వారా బస్సు రూట్ మ్యాప్, బస్సు ఎప్పుడు వస్తుంది, ఎంత సేపటికి గమ్యస్థానం చేరుకోవచ్చు వంటి వివరాలు వెంటనే తెలుస్తాయి. ఇప్పటికే తిరుమలలో 46 నుంచి 50 వరకు ఉచిత ఎలక్ట్రిక్ ధర్మరథాలు నడుస్తున్నాయి. రిలయన్స్, భారత్ బయోటెక్ వంటి సంస్థల విరాళాలతో ఈ సంఖ్య పెరిగింది. ప్రతి మూడు నిమిషాలకు ఒక బస్సు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేశారు.
రోజుకు సుమారు 650 ట్రిప్స్ జరుగుతూ 85 వేల మంది భక్తులకు సేవలు అందుతున్నాయి. గతంలో భక్తులు ఆరుబయటే నిలబడి బస్సుల కోసం ఎదురుచూసేవారు. ఎండలో, వర్షంలో ఇబ్బంది పడేవారు. కొత్త స్మార్ట్ బస్టాప్‌లు వచ్చాక ఈ ఇబ్బంది తొలగిపోనుంది. ఒక్కో స్మార్ట్ షెల్టర్‌కు రూ.22 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు ఖర్చవుతుందని టీటీడీ అంచనా వేస్తోంది.
రేమండ్స్ సంస్థ ప్రతినిధులు ఇటీవల తిరుమలకు వచ్చి ప్రస్తుత బస్ షెల్టర్లను పరిశీలించారు.ఎలక్ట్రిక్ బస్సుల వాడకం వల్ల తిరుమలలో కాలుష్యం గణనీయంగా తగ్గింది. ప్రైవేట్ వాహనాలపై ఆధారపడే పరిస్థితి కూడా మారుతోంది. భక్తులకు మరింత సౌకర్యం కల్పించే దిశగా టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. త్వరలోనే ఈ స్మార్ట్ బస్టాప్‌లు రూపుదిద్దుకుని భక్తుల సేవలో నిలవనున్నాయి.












Click it and Unblock the Notifications
