తిరుపతిలోనే కాదు, ఈ ప్రాంతాల్లోనూ శ్రీవారి దర్శనం టికెట్లు.. బుకింగ్ ఇలా..!!
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. పెరుగుతున్న భక్తులకు అనుగుణంగా టీటీడీ చర్యలు తీసుకుంటోంది. కమాండ్ కంట్రోల్ ద్వారా క్యూ లైన్లలో భక్తుల రద్దీకి అనుగుణంగా దర్శనం వేగంగా అందేలా పర్యవేక్షిస్తోంది. 24 గంటలకు పైగా దర్శనానికి సమయం పడుతుండటంతో వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్ణయాలు తీసుకుంటోంది. ఇదే సమయంలో భక్తులకు ఏపీలోని నాలుగు ప్రధాన విమానాశ్రయాల్లో దర్శన టికెట్లు అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా టీటీడీ నిర్ణయం అమలు చేసేందుకు సిద్దమైంది.
తిరుమల శ్రీవారి భక్తులకు మరింత సులభంగా దర్శన భాగ్యం కల్పించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటివరకు కేవలం తిరుపతి విమానా శ్రయంలో మాత్రమే అందుబాటులో ఉన్న 'శ్రీవాణి' విఐపి బ్రేక్ దర్శన టికెట్లను, ఇకపై ఆంధ్రప్రదేశ్‌లోని మరికొన్ని ప్రధాన విమానాశ్రయాల్లోనూ జారీ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. గన్నవరం (విజయవాడ), రాజమహేంద్రవరం (రాజమండ్రి), విశాఖపట్నం విమానాశ్రయాల్లోనూ ఈ టికెట్లను ఆఫ్‌లైన్ విధానంలో అందుబాటులోకి తీసుకురావాలని టీటీడీ నిర్ణయించింది. ఈ మేరకు పూర్తి విధి విధానాలను సిద్దం చేస్తోంది. ప్రస్తుతం శ్రీవాణి టికెట్లను ప్రతి మూడు నెలలకోసారి ఆన్‌లైన్‌లో రోజుకు 500 చొప్పున విడుదల చేస్తున్నారు. ఇవి కాకుండా కరెంట్ బుకింగ్ కింద తిరుమలలో నేరుగా రూ. 10,500 (రూ. 10,000 విరాళం + రూ. 500 దర్శన టికెట్) చెల్లించి టికెట్ పొందే 800 మంది భక్తులకు అదే రోజు సాయంత్రం దర్శనం కల్పిస్తున్నారు.

నాలుగు విమానాశ్రయాల్లోనూ అందుబాటులోకి
కాగా, ఆఫ్‌లైన్ కోటా కింద తిరుపతి ఎయిర్‌పోర్టులో మరో 200 టికెట్లు కేటాయిస్తున్నారు. అయితే, ఇప్పుడు ఈ ఆఫ్‌లైన్ కోటాను పునర్వ్యవస్థీకరించి, పైన పేర్కొన్న నాలుగు విమానాశ్రయాల్లో ఒక్కో చోట రోజుకు 50 టికెట్ల చొప్పున జారీ చేయాలని టీటీడీ భావిస్తోంది. ఇందు కోసం నాలుగు విమానాశ్రయాల్లో అత్యాధునిక 'కియోస్క్' యంత్రాలను ఏర్పాటు చేయనున్నారు. దీని కోసం టీటీడీ ఇప్పటికే సంబంధిత బ్యాంకులను సంప్రదించింది. భక్తులు ఈ యంత్రాల ద్వారా రూ. 10,500 చెల్లించగానే, అక్కడికక్కడే వారి ఫొటోను తీసుకుని కియోస్క్ మెషిన్ టికెట్‌ను జారీ చేస్తుంది. ఈ టికెట్ పొందిన భక్తులు తిరుమల చేరుకున్నాక, క్యూలైన్ల వద్ద ఆ టికెట్‌ను స్కాన్ చేసి నేరుగా దర్శనానికి వెళ్లేలా విధి విధానాలు అమలు చేయనున్నారు.













Click it and Unblock the Notifications