శ్రీవారి సేవకులుగా ఇక- నియామకం, శిక్షణ పై టీటీడీ తాజా నిర్ణయం..!!
Tirumala: టీటీడీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. అలిపిరిలోనే ఆధ్యాత్మిక టౌన్ షిప్ ఏర్పాటుకు తాజాగా టీటీడీ బోర్డు ఆమోద ముద్ర వేసింది. భక్తుల సేవలను సాంకేతిక సాయంతో మరింత మెరుగు పర్చేలా నిర్ణయాలు తీసుకుంటోంది. ఇదే సమయంలో శ్రీవారి సేవకుల వ్యవస్థ లోనూ కీలక మార్పులు తీసుకొస్తోంది. అందులో భాగంగా మాస్టర్ ట్రైనర్ల విధానానికి టీటీడీ శ్రీకారం చుట్టింది. శ్రీవారి సేవకులకు శిక్షణ విధానంలోనూ మార్పులు తెచ్చింది.
శ్రీవారి సేవకుల వ్యవస్థలో టీటీడీ కీలక మార్పులు చేస్తోంది. తిరుమలకు వచ్చే భక్తులకు మరింత మెరుగైన, క్రమశిక్షణతో కూడిన సేవలు అందించాలనే లక్ష్యంతో తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. శ్రీవారి సేవకులకు దిశా నిర్దేశం చేసేందుకు 1,500 మంది మాస్టర్ ట్రైనర్ల వ్యవస్థను సిద్ధం చేస్తోంది. ఐఐఎం, రాష్ట్ర ప్రణాళికా విభాగం కలిసి సంయుక్తంగా ఈ బృహత్తర ప్రణాళికను రూపొందించాయి. మాస్టర్ ట్రైనర్ల ఎంపిక కోసం టీటీడీ 3 నెలల కిందట ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానించింది. 2000 పైగా అప్లికేషన్లు వచ్చాయి. డిగ్రీ ఆపై చదువుకున్న విద్యావంతులను, 45-65 ఏళ్ల వయసు ఉన్న వారిని ఎంపిక చేశారు. వీరిని 15 బ్యాచ్ లుగా విభజించి.. ఒక్కో బ్యాచ్‌కు 150 మంది చొప్పున వారం రోజుల పాటు శిక్షణ ఇస్తున్నారు.

వీరికి ఎస్వీయూ ఆచార్యులు, హెచ్‌ఆర్ నిపుణులు, టీటీడీ విభాగాధిపతులు పాఠాలు బోధిస్తు న్నారు. హిందూ సనాతన ధర్మం, తిరుమల చరిత్ర గురించి వివరంగా చెబుతున్నారు. తిరుమలకు నిత్యం కొన్ని వేలల్లో భక్తులు వస్తుంటారు. ఇక విశిష్ట రోజుల్లో అయితే భక్తులతో తిరుపతి క్షేత్రం రద్దీగా ఉంటుంది. ఈ సమయాల్లో భక్తులతో మర్యాదగా ప్రవర్తించే తీరు, క్రౌడ్ మేనేజ్మెంట్ (రద్దీ నియంత్రణ), అత్యవసర సమయాల్లో సీపీఆర్ వంటి ప్రథమ చికిత్స అందించడంలో వీరికి తర్ఫీదు ఇస్తున్నారు. వారంలో కనీసం 2 రోజులు వివిధ విభాగాల్లో క్షేత్రస్థాయి శిక్షణలు ఉంటాయి. తిరుమలలో శిక్షణ పూర్తి చేసుకున్న మాస్టర్ ట్రైనర్లు సొంత జిల్లాలకు వెళ్లాక ఆ ప్రాంతం నుంచి శ్రీవారి సేవకు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న భక్తుల వివరాలను (సుమారు 20 మంది జాబితా) టీటీడీ వీరికి పంపిస్తుంది. వారికి వారాంతాల్లో సుమారు 10 గంటల పాటు శిక్షణ ఇస్తారు. శ్రీవారి సేవకు వెళ్లే వారికి తిరుమలలో ఏం చేయాలి, ఏం చేయకూడదు, భక్తులతో ఎలా ఉండాలి అనే విషయాలపై ముందే అవగాహన కల్పిస్తారు.












Click it and Unblock the Notifications