తిరుమలలో నిర్వహించే విశేష ఉత్సవాలు.. ఈ 4 ప్రత్యేకం
Tirumala: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. సోమవారం నాడు 84,179 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 33,036 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 4.72 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 29 కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి 18 నుంచి 20 గంటల సమయం పట్టింది. కంపార్ట్‌మెంట్లు, క్యూలైన్లల్లో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు అల్పాహారం, పాలు, మంచినీరు పంపిణీ చేశారు.

కాగా- జులైలో తిరుమల శ్రీవారి ఆలయంలో నిర్వహించే పర్వదినాలు, ఇతర విశేష ఉత్సవాలకు సంబంధించిన వివరాలను టీటీడీ అధికారులు విడుదల చేశారు. 5వ తేదీన పెరియాళ్వార్ శాత్తుమొరతో ఈ ఉత్సవాలు ఆరంభమౌతాయి. 30న కల్కి జయంతి, కశ్యప మహర్షి జయంతితో ముగుస్తాయి.
జులై 6న శయన ఏకాదశి, చాతుర్మాస్య వ్రతారంభం కార్యక్రమాన్ని శ్రీవారి ఆలయంలో వైభవంగా జరుగనుంది. 7న శ్రీనాథ మునుల వర్ష తిరు నక్షత్రం, 10న గురు పౌర్ణమి గరుడసేవ ఉంటుంది. ప్రతి పౌర్ణమికీ గరుడ సేవను కన్నుల పండువగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
సాయంత్రం 7 నుంచి రాత్రి 9 గంటల మధ్య సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు సువర్ణకాంతులీనుతున్న గరుడునిపై తిరుమాడ వీధులలో భక్తులకు దర్శనమిస్తారు ఆ రోజున. ఈ ఉత్సవాన్ని తిలకించడానికి పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలి వస్తుంటారు.
16వ తేదీన శ్రీవారి ఆలయంలో ఆణివారి ఆస్థాన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. 25న చక్రతాళ్వార్ వర్ష తిరు నక్షత్రం, 28న శ్రీవారు పురిశైవారి తోటకు వేంచేపు, 29న గరుడ పంచమి, శ్రీవారి గరుడసేవ వేడుకలు ఉంటాయి. 30న కల్కి జయంతి, కశ్యప మహర్షి జయంతి ఉత్సవాలు నిర్వహిస్తారు. శయన ఏకాదశి, పౌర్ణమి గరుడ సేవ, ఆణివార ఆస్థానం, గరుడ పంచమి ప్రత్యేకమైనవి.












Click it and Unblock the Notifications