TTD: భక్తుల కానుకలపై కీలక నిర్ణయం, బంగారం.. నగదు లెక్కలిలా- ఇక నుంచి..!!
Tirumala: టీటీడీ వరుస నిర్ణయాలు తీసుకుంటోంది. భక్తులకు దర్శనం.. వసతితో పాటుగా సదు పాయాల విషయంలో సాంకేతికత వినియోగంలోకి తెస్తోంది. భక్తులకు ఏఐ ఆధారిత సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తోంది. ఇదే సమయంలో శ్రీవారికి భక్తులు సమర్పించే కానుకల డిపాజిట్లపై టీటీడీ దృష్టి పెట్టింది. వడ్డీ ఆదాయాన్ని మరింత పెంచే దిశగా ప్రణాళికలు అమలు చేస్తోంది. ఇప్పటికే ఈ విషయంలో నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా తదుపరి నిర్ణయాలకు సిద్దం అవుతోంది.
భక్తుల కానుకులపై
శ్రీవారికి పెద్ద సంఖ్యలో భక్తులు నిరంతరం కానుకలు సమర్పిస్తూ ఉంటారు. హుండీలో సమర్పించే కానుకలు.. డిపాజిట్ల పైన టీటీడీ ఇప్పుడు పూర్తి స్థాయిలో ప్రత్యేక దృష్టి సారించింది. స్వామి సొమ్ముకు భద్రతతో పాటు ఆదాయంపై కూడా శ్రద్ధ వహిస్తోంది. ఇందు కోసం టీటీడీ నియమించిన 'ఇన్వెస్ట్మెంట్ ఎక్స్‌పర్ట్ కమిటీ' చేసిన కీలక ప్రతిపాదనలు పరిగణనలోకి తీసుకుని గోవిందుడి ఖజానాను మరింత పెంచే దిశగా అడుగులు వేస్తోంది. స్వామివారిని దర్శించుకునే భక్తులు తమ స్థాయిని బట్టి హుండీలో నగదుతో పాటు బంగారం, వెండి కూడా కానుకలుగా సమర్పిస్తారు. గత ఏడాది ఏప్రిల్ నాటి లెక్కల ప్రకారం వివిధ బ్యాంకుల్లో టీటీడీ బంగారు డిపాజిట్లు 11,329 కేజీల వరకు ఉన్నాయి. వీటి విలువ రూ.8,496 కోట్లు ఉండవచ్చని అంచనాగా తెలుస్తోంది.

డిపాజిట్ల లెక్కలు
అదే విధంగా ఇక నగదు ఫిక్సిడ్ డిపాజిట్లు రూ.18వేల కోట్లకు చేరాయి. బంగారు, నగదు డిపాజిట్ల ద్వారా 2024-25 వార్షిక సంవత్సరానికి రూ.1,253 కోట్ల వడ్డీ లభించినట్టు టీటీడీ బడ్జెట్‌లోనూ వెల్లడించింది. ఇప్పుడు టీటీడీ తాజాగా ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల్లో ఉన్న శ్రీవారి డిపాజిట్లపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ప్రైవేట్ బ్యాంకుల్లో ఉన్న డిపాజిట్లు తిరిగి తీసుకుని ప్రభుత్వ బ్యాంకుల్లో డిపాజిట్లు చేసే అవకాశం ఉంటుందా.. ఇందులో ఎదురయ్యే సమస్యల పైన నివేదిక ఇవ్వాలని గతేడాది నవంబరులో జరిగిన బోర్డు సమావేశంలో తీర్మానం చేశారు. నిమ్మగడ్డ రమేశ్‌తో పాటు ఆర్‌బీఐ రిటైర్డ్ డిప్యూటీ గవర్నర్ గాంధీ, చెన్నై ఇండియన్ బ్యాంక్ రిటైర్డ్ చైర్మన్ సుందరరాజన్, స్టేట్‌బ్యాంక్ ఆఫ్ పటియాలా రిటైర్డ్ ఎండీ రమేశ్‌తో నిపుణుల కమిటీ ఏర్పాటు చేశారు. కమిటీ గతేడాది చివర్లో నివేదిక సమర్పించింది.
ఇక నుంచి ఆన్ లైన్ లో
టీటీడీ సూచించిన అంశాల పైన కమిటీ కీలక అంశాలను వెల్లడించింది. ప్రభుత్వ రంగ బ్యాంకు ల్లోనే డిపాజిట్ చేయాలని భావిస్తే వడ్డీ రేట్లు కోల్పోవాల్సి వస్తుందని, కొన్ని ప్రైవేట్ బ్యాంకులతో పోలిస్తే వడ్డీ తక్కువ కాబట్టి మంచి ఫలితాలు రాకపోవచ్చని కమిటీ పేర్కొంది. ప్రస్తుతం ప్రైవేట్ బ్యాంకులైనా, పబ్లిక్ బ్యాంకులైనా ఆర్బీఐ నిబంధనలకు అనుగుణంగానే పనిచేస్తున్న క్రమంలో భద్రత విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వెల్లడించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ దేవదాయ చట్టాలు కూడా ప్రైవేట్ బ్యాంకుల్లో పెట్టుబడులు పెట్టుకోవచ్చని చెబుతున్న అంశాలను ప్రస్తావించింది. ప్రభుత్వ బ్యాంకుల్లోనే పెట్టుబడులు పెట్టాలని భావిస్తే తక్షణమే ప్రైవేట్ బ్యాంకుల్లో చేసే డిపాజిట్లను నిలిపివేయాలని సూచించింది. రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీ ల్లోనే కాకుండా కేంద్ర సెక్యూరిటీల్లో కూడా పెట్టుబడులు పెడితే లాభాలు వస్తాయని సూచించింది. పేమెంట్ గేట్‌వే, ఆన్‌లైన్ డొనేషన్ కలెక్షన్లు, క్యాష్ మేనేజ్మెంట్ వంటి సర్వీసులను టీటీడీ వినియోగించుకోవాలని సూచించింది.












Click it and Unblock the Notifications