భక్తుల ఇబ్బందులకు TTD చెక్, బ్రహ్మోత్సవాల వేళ ప్రారంభం- ఇక అన్నీ ఒకే చోట..!!
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. మంగళవారం కావడం, వరస సెలవులు పూర్తి కావడంతో భక్తుల రద్దీ అనుకున్నంత స్థాయిలో లేదు. భక్తులు సులువుగానే ఏడుకొండలవాడిని దర్శించుకుని తరిస్తున్నారు. ఈ నెలలో ప్రత్యేక పర్వదినాలు.. బ్రహ్మోత్సవాల నిర్వహణకు టీటీడీ పలు నిర్ణయాలు తీసుకుంటోంది. ఇదే సమయంలో బ్రహ్మోత్సవాల వేళ భక్తులకు మరింత గా సదుపాయాలు అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది.
తిరుమలకు వచ్చే భక్తుల వసతి కష్టాలకు టీటీడీ చెక్ పెడుతోంది. కొద్ది నెలల క్రితం తిరుమలలో అందుబాటులోకి వచ్చిన పీఏసీ- 5 ను పెద్ద సంఖ్యలో భక్తులు వినియోగించుకుంటున్నారు. తిరుమలలో తిరుమలలో 60 వేల మంది యాత్రికులకు వసతి కల్పించేలా 7600 గదులు, 5 పీఏసీలు ఉన్నాయి. అయినా.. గదుల కోసం భక్తులు ఇబ్బంది పడుతున్నారు. దీంతో.. తిరుపతిలో కొత్త వసతి సముదాయాలను సిద్దం చేసారు. బ్రహ్మోత్సవాల వేళ తిరుపతిలో భక్తుల కోసం నిర్మించిన 'శ్రీపాదం', 'అచ్యుతం' వసతి సముదాయాలను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. ఈ మేరకు టీటీడీ తుది ఏర్పాట్లను వేగవంతం చేసింది. తిరుపతి రైల్వే స్టేషన్ సమీపంలో గోవిందరాజస్వామి సత్రాల స్థానంలో నిర్మిస్తున్న శ్రీపాదం, అచ్యుతం సముదాయాల పనులు చివరి దశకు వచ్చాయి. ప్రధాన భవనం, గదుల నిర్మాణం పూర్తయినా, లోపలి ఏర్పాట్లు, మౌలిక సదుపాయాలు దాదాపు పూర్తయ్యాయి.

బ్రహ్మోత్పవాల వేళ ప్రారంభం.. ఒకే సారి పది వేల మందికి
ఈ రెండు సముదాయాల్లో భాగంగా ఒక్కో భవనంలో తొమ్మిది అంతస్తులు నిర్మిస్తున్నారు. గదులు 532 చొప్పున 1,064 ఉన్నాయి. దాదాపుగా పదివేల మంది భక్తులకు వసతి కల్పించే వెసులుబాటు కలగనుంది. కాగా, రెండో అంతస్తులో రిసెప్షన్, అన్నదానం, వసతి కేంద్రాలు ఉంటాయి. మూడు, నాలుగు అంతస్తుల్లో 48 డార్మెటరీలు.. సుమారు 7,000 మందికి సరిపడా లాకర్ల ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ రెండు సముదాయాల నిర్మాణం 2024 మార్చి నెలలో పనులు ప్రారంభం అయ్యాయి. వీటి నిర్మాణానికి రూ.600 కోట్లు ఖర్చు చేస్తున్నారు. తిరుమలలో ప్రస్తుతం ఉన్న వసతి గదులు పెరుగుతున్న భక్తుల సంఖ్యకు అనుగుణంగా సరిపోవటం లేదు. అయితే.. తిరుపతిలో వసతి సౌకర్యం పెరిగితే.. భక్తులకు ప్రయోజనం ఉంటుందని భావిస్తున్నారు. 2022 లోనే ఈ రెండు కొత్త భవనాల నిర్మాణం పైన నిర్ణయం తీసుకున్నారు. ఒకే సారి దాదాపు 10వేలమందికి సరిపోయే విధంగా వసతి గదులు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ గదులను ఆన్ లైన్ తో పాటుగా ఆఫ్ లైన్ లోనే పొందే విధంగా వచ్చే నెల భక్తులకు వినియోగంలోకి తీసుకు వచ్చే విధంగా తుది కసరత్తు కొనసాగుతోంది.













Click it and Unblock the Notifications