TTD: అందుబాటులోకి ఏఐ సేవలు: దర్శనం, వసతి ఇక.. అలిపిరి నుంచే ట్రాకింగ్..!!
Tirumala: తిరుమలలో బ్రహ్మోత్సవ శోభ మొదలైంది. బ్రహ్మోత్సవాల వేళ టీటీడీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ సారి బ్రహ్మోత్సవాల సమయంలో తిరుమలలో సాంకేతిక భక్తుల సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. దేశంలోనే తొలి సారిగా ఏఐ కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభం కానుంది. నిరంతరం భక్తుల దర్శనం..వసతి.. భద్రత వంటివి పర్యవేక్షించేందుకు ఈ కేంద్రం పని చేయనుంది. దర్శనం క్యూ లైన్ల నిర్వహణలోనూ సహకరించనుంది. అలిపిరి నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనం వరకు అన్నింటా పర్యవేక్షణ కొనసాగనుంది.
శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు సేవల కోసం టీటీడీ ఆర్టీఫీషియల్ ఇంటలిజెన్స్ సేవలను వినియోగంలోకి తీసుకొచ్చింది. దేశంలోనే తొలిసారిగా తిరుమలలో ఏఐ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ఐసీసీసీ)ను అందుబాటులోకి తెచ్చారు. వైకుంఠం-1 కాంప్లెక్స్‌లో ఈ వ్యవస్థను ఏర్పాటు చేసింది.

దీని ద్వారా భక్తుల రద్దీ నియంత్రణ, వసతి, భద్రత పెంపొందించేందుకు చర్యలు చేపట్టనుంది. ఈ ఏఐ కేంద్రాన్ని ఈ నెల 25న సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో పెద్ద డిజిటల్ స్క్రీన్‌పై అన్ని విభాగాలకు చెందిన సీసీ టీవీ ఫుటేజీలు కనిపిస్తాయి. వీటిని 25 మందికిపైగా సాంకేతిక సిబ్బంది పర్యవేక్షిస్తూ నిరంతరం అధికారులకు అక్కడ ఉండే పరిస్థితులను తెలియజేస్తారు.
ప్రస్తుతం ఉన్న వాటితో పాటు కొత్తగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కెమెరాలతో అలిపిరి వద్ద నుంచే భక్తుల రద్దీని ఏఐ అంచనా వేస్తుంది. క్యూలైన్లలో ఎంతమంది భక్తులు ఉన్నారు, ఎంత సమయంగా వారు వేచి ఉన్నారు, సర్వదర్శనం పరిస్థితి తదితర అంశాలను ఏఐ ట్రాక్ చేస్తుంది. ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ ద్వారా భక్తులను గుర్తిస్తుంది. భక్తుల ముఖ కదలికలు (హావభావాలు) ఆధారంగా వారి ఇబ్బందులు తెలుసుకునేలా వ్యవస్థ ఏర్పాటు చేసారు.
క్యూలైన్లు, వసతి ఇతర సౌకర్యాలను వాస్తవ పరిస్థితులతో 3డీ మ్యాప్‌లు, చిత్రాలతో చూపుతుంది. రద్దీ ఉన్న ప్రాంతాల్ని రెడ్ స్పాట్లుగా చూపడంతో పాటు చర్యలు తీసుకోవాలని సంకేతాలు ఇస్తుంది. ఎప్పటికప్పుడు భక్తుల పరిస్థితిని తెలుసుకుని శ్రీవారి దర్శనాన్ని మరింత సులభతరం చేసేందుకు సహకరిస్తుంది. అత్యవసర పరిస్థితుల్లో భక్తులను బయటకు తీసుకొచ్చే సమీప మార్గాలను చూపుతుందని అధికారులు వెల్లడించారు.












Click it and Unblock the Notifications