TTD: దర్శనం, గదుల కోటా విడుదల - సేవా టికెట్లు ఇలా..!!
Tirumala: టీటీడీ ఈ రోజు ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను విడుదల చేయనుంది. ప్రతీ నెలా తరహాలోనే ఈ రోజు నవంబరు నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఆగష్టు 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అదే విధంగా తిరుమల, తిరుపతిలలో నవంబరు నెల గదుల కోటాను ఆగష్టు 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారని అధికారులు వెల్లడించారు.
దర్శనం - వసతి
ఇక, ఈ నెల 27న తిరుమల - తిరుపతి శ్రీవారి సేవ కోటా ఉదయం 11 గంటలకు, నవనీత సేవ మధ్యాహ్నం 12 గంటలకు, పరకామణి సేవ మధ్యాహ్నం 1 గంటకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. భక్తులు
https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ అధికారులు సూచించారు. తిరుమల శ్రీవారి ఆలయంలో అక్టోబర్ 4 నుండి 12వ తేదీ వరకు నవహ్నిక సాలకట్ల బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించనున్నారు. అక్టోబర్ 3వ తేదీ సాయంత్రం అంకురార్పణతో ఈ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి.

జన్మాష్టమి వేడుకలు
బ్రహ్మోత్సవాల్లో ప్రతి రోజు ఉదయం 8 నుండి 10 గంటల వరకు మరియు సాయంత్రం 7 గంటల నుండి 9 గంటల వాహన సేవలు ఉంటాయి. ఈ నెల 27న క్రిష్ణాష్టమి సందర్భంగా శ్రీవారి ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని సాక్షాత్తు ద్వాపరయుగపురుషుడైన శ్రీకృష్ణునిగా స్మరించుకుని ఆగస్టు 27వ తేదీన శ్రీకృష్ణజన్మాష్టమి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో గోకులాష్టమి ఆస్థానం నిర్వహించనున్నారు. బంగారు వాకిలి ముఖ మండపంలో రాత్రి 8 నుండి 10 గంటల వరకు గోకులాష్టమి ఆస్థానం నిర్వహిస్తారు.
సేవలు రద్దు
బంగారు సర్వభూపాల వాహనంపై శ్రీకృష్ణస్వామివారిని వేంచేపు చేసి నివేదనలు సమర్పిస్తారు. శ్రీ ఉగ్ర శ్రీనివాసమూర్తికి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు, శ్రీకృష్ణస్వామివారికి ఏకాంత తిరుమంజనం నిర్వహిస్తారు. అనంతరం ద్వాదశారాధనం చేపడతారు. ఆగస్టు 28న తిరుమలలో ఉట్లోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తారు. సాయంత్రం 4 గంటలకు ఈ ఉత్సవాన్ని తిలకించడానికి శ్రీ మలయప్పస్వామివారు బంగారు తిరుచ్చిపై, శ్రీకృష్ణస్వామివారు మరో తిరుచ్చిపై తిరుమాడ వీధులలో విహరిస్తారు. ఈ నెల 28న శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఆర్జిసేవలైన ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టిటిడి రద్దు చేసింది.












Click it and Unblock the Notifications