టీటీడీలో శ్రీవెంకటేశ్వర ఆలయాల నిర్మాణ నిధి
తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎస్వీ అన్నదానం, ఎస్వీ ప్రాణదానం తరహాలో దేశవ్యాప్తంగా శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయాల నిర్మాణాలు చేపడుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. తిరుమల పద్మావతీ అతిథి గృహంలో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, కార్యనిర్వహణాధికారి జే శ్యామల రావు, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి విలేకరులతో మాట్లాడారు.
దేశంలోని అన్ని రాజధానులలో శ్రీవేంకటేశ్వర స్వామి వారి ఆలయాలను నిర్మించేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించినట్లు తెలిపారు. గ్రామాల్లోని ఆలయాల్లో ప్రతి ఒక్కరూ సేవ చేయాలని సూచించారు. శ్రీవారి సేవను మరింత పకడ్బందీగా అమలు చేసేలా ప్రణాళికలు చేపట్టాలని సూచించారు.

అమరావతిలో శ్రీనివాస కల్యాణోత్సవం ద్వారా నూతనోత్సాహం, నమ్మకం పెరిగిందన్నారు. శ్రీవారి ఆశీస్సులతో రాజధాని పునఃనిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. టీటీడీలో ఎలాంటి వ్యాపారాత్మక నిర్మాణాలు చేపట్టరాదని, శ్రీవారి పవిత్రతను కాపాడటానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు.
టీటీడీలో పనిచేస్తున్న ఉద్యోగులు హిందువులే అయ్యుండాలని, అన్యమతస్తులకు మరోచోట ప్రత్యామ్నాయం చూపుతామని తెలిపారు. ఎవరి మత సంస్థల్లో వారే పనిచేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఏడు కొండలు శ్రీవారి సొంతమని, తిరుమలలో ఎలాంటి అపవిత్ర కార్యాకలపాలు చేయడం, వ్యాపార ధోరణితో చూడడం జరగకూడదని అన్నారు.
శ్రీవాణి ట్రస్ట్ నిధులను కూడా ఆలయాల నిర్మాణాల కోసం వినియోగించుకోవాలని యోచిస్తోన్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు. ఏపీలో అద్భుతమైన ఆలయ నిర్మాణ, పర్యావరణ వ్యవస్థ ఉందని, తమ ప్రభుత్వ అంతిమ లక్ష్యం ఈ దేవాలయాలన్నింటినీ అభివృద్ధి చేయడమేనని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications