అనకాపల్లి అత్యుతాపురం సెజ్ లో భారీపేలుడు-ఇద్దరి మృతి-పలువురికి గాయాలు
ఏపీలో అనకాపల్లిలోని అచ్యుతాపురం సెజ్ లో ఇవాళ భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సెజ్ లోని సాహితీ ల్యాబ్ లో రియాక్టర్ పేలిపోవడంతో ఇందులో పనిచేస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. మరికొందరు తీవ్ర గాయాల పాలయ్యారు. పేలుడుతో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. గతంలోనూ అచ్యుతాపురం సెజ్ లో రియాక్టర్ పేలుడు జరిగింది. ఇప్పుడు మరోసారి భారీ పేలుడు జరగడంతో కార్మికులు, స్ధానికులు కూడా ఉలిక్కిపడ్డారు.

అనకాపల్లిలోని అచ్యుతాపురం సెజ్ లో చోటు చేసుకున్న భారీ రియాక్టర్ పేలుడు, అగ్నిప్రమాదంతో కార్మికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. పేలుడు కారణంగా భారీగా మంటలు ఎగసిపడటంతో దట్టమైన పొగ అలుముకుంది. దీంతో పాటే చుట్టుపక్కల పరిశ్రమలకు మంటలు కూడా వ్యాపిస్తాయన్న ఆందోళనలో కార్మికులు ఉన్నారు. ప్రమాద సమాచారం తెలియగానే మూడు అగ్నిమాపక యంత్రాలు అక్కడికి చేరుకుని మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నాయి.
మంటలు ఆరితేనే కానీ సాహితీ ఫార్మాలో జరిగిన పేలుడు తీవ్రత, ఎంతమంది చనిపోయారనే విషయాలు తెలిసే అవకాశాలు కనిపించడం లేదు. పేలుడు తర్వాత అక్కడ పనిచేస్తున్న కార్మికులు భయంతో పరుగులు తీశారు. సెజ్ లోని ఇతర పరిశ్రమలు కూడా పేలుడుతో అప్రమత్తం అయ్యాయి. వెంటనే ఫైర్ డ్రిల్ నిర్వహించి తమ కార్మికుల్ని అప్రమత్తం చేస్తున్నాయి. గతంలోనూ ఇక్కడ ఇలాంటి పేలుళ్లే చోటు చేసుకోవడంతో కార్మికుల కుటుంబాలు భయాందోళనకు గురవుతున్నాయి.












Click it and Unblock the Notifications