ఏపీలో నకిలీ యూనివర్సిటీలపై యూజీసీ ప్రకటన.. దేశవ్యాప్తంగా ఫేక్ వర్సిటీలు ఎన్నంటే!
విద్యార్థులలో విజ్ఞానాన్ని నింపి భావిభారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత యూనివర్సిటీల పైన ఉంటుంది. అయితే అటువంటి యూనివర్సిటీలలో కూడా ఫేక్ యూనివర్సిటీలు ఉన్నాయని తాజాగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ దేశంలోని నకిలీ యూనివర్సిటీలకు సంబంధించిన డేటాను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 21 ఫేక్ యూనివర్సిటీలు ఉన్నాయని యుజీసి ప్రకటించింది. ఇందులో ఏపీలో రెండు యూనివర్సిటీలు ఉన్నాయని తెలిపింది.
దేశంలో 21నకిలీ యూనివర్సిటీలు
ఈ సంవత్సరం మే నాటికి దేశంలో 21నకిలీ యూనివర్సిటీలు ఉన్నట్టు గుర్తించిన యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఈ యూనివర్సిటీలు జారీచేసే డిగ్రీలు చెల్లుబాటు కావని పేర్కొంది. ఈ యూనివర్సిటీలకు డిగ్రీలు ప్రధానం చేసే అధికారం లేదని వెల్లడించింది. ఇక దేశవ్యాప్తంగా ఉన్న నకిలీ యూనివర్సిటీలలో దేశ రాజధాని ఢిల్లీలో అత్యధికంగా 8యూనివర్సిటీలు ఉన్నాయని, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నాలుగు, ఏపీ, కేరళ, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలలో రెండు చొప్పున ఉన్నాయని యుజిసి పేర్కొంది

ఏపీలో రెండు నకిలీ యూనివర్సిటీలు
అంతేకాదు కర్ణాటక, పుదుచ్చేరి, మహారాష్ట్రలో ఒక్కొక్క యూనివర్సిటీ చొప్పున ఫేక్ యూనివర్శిటీలు ఉన్నట్టుగా వెల్లడించింది. ఇక యుజిసి ప్రకటించిన నకిలీ విశ్వవిద్యాలయాల జాబితా విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుంటూరు కాకుమాను వారి తోటలో ఉన్న క్రైస్ట్ టెస్టమెంట్ డీమ్డ్ యూనివర్సిటీ, విశాఖపట్నం ఆంధ్ర ప్రదేశ్ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఆఫ్ ఇండియా 2 నకిలీ యూనివర్సిటీలుగా తేల్చింది.
ఢిల్లీ లో అత్యధికంగా ఫేక్ యూనివర్సిటీలు
దేశ రాజధాని ఢిల్లీలో ఢిల్లీ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అండ్ ఫిజికల్ హెల్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయం, ఢిల్లీ కమర్షియల్ యూనివర్సిటీ లిమిటెడ్ దర్యాగంజ్, ఢిల్లీ ఐక్యరాజ్యసమితి విశ్వవిద్యాలయం, ఢిల్లీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఢిల్లీ ఒకేషనల్ యూనివర్సిటీ, ఢిల్లీ ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం, ఢిల్లీ విశ్వకర్మ ఓపెన్ యూనివర్సిటీ ఫర్ సెల్ఫ్ ఎంప్లాయిమెంట్, ఢిల్లీ ఏడిఆర్ సెంట్రిక్ జ్యురిడికల్ యూనివర్సిటీలు ఫేక్ యూనివర్సిటీలని తేల్చింది.
యూపీ, పశ్చిమ బెంగాల్ లోనూ నకిలీ వర్సిటీలు
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గాంధీ హిందీ విద్యాపీఠం, నేతాజీ సుభాష్ చంద్రబోస్ విశ్వవిద్యాలయం ఓపెన్ యూనివర్సిటీ, భారతీయ శిక్ష పరిషత్, మహామాయ సాంకేతిక విశ్వవిద్యాలయం నకిలీ విశ్వవిద్యాలయాలుగా ప్రకటించింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ కోల్కత్త, పశ్చిమ బెంగాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ అండ్ రీసెర్చ్ ఫేక్ యూనివర్సిటీలు అని వెల్లడించింది.
కేరళ, కర్నాటక, పుదుచ్చేరి, మహారాష్ట్రలలోనూ నకిలీ విశ్వ విద్యాలయాలు
కేరళలోని సెయింట్ జాన్స్ విశ్వవిద్యాలయం కేరళ ఇంటర్నేషనల్ ఇస్లామిక్ యూనివర్సిటీ ఆఫ్ ప్రోఫిటిక్ మెడిసిన్, కర్ణాటక రాష్ట్రంలోని కర్ణాటక బడగన్వి సర్కార్ వరల్డ్ ఓపెన్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ సొసైటీ, మహారాష్ట్రలోని మహారాష్ట్ర రాజా అరబిక్ విశ్వవిద్యాలయం, పుదుచ్చేరిలోని శ్రీ బోధి అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ పుదుచ్చేరి నకిలీ యూనివర్సిటీలని, ఈ యూనివర్సిటీలు ఇచ్చే డిగ్రీలు చెల్లుబాటు కావని విద్యార్థుల విద్యా, ఉద్యోగ ప్రయోజనాలను నెరవేర్చవని యుజిసి పేర్కొంది.












Click it and Unblock the Notifications