"ఎక్కువ పిల్లలు చాలా కష్టం.."- తేల్చేసిన చంద్రబాబు..! అయినా..!
ఏపీలో ప్రజలు ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ పిల్లలు కనేలా ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం.. ఇందుకోసం ప్రోత్సాహకాలను సైతం ప్రకటించింది. అయితే ఈ విషయంలో ఎలాంటి పురోగతి ఉన్నట్లు కనిపించడం లేదు. ఓ పక్కన పెరుగుతున్న జీవన వ్యయాలు, మరోవైపు అంతకంతకూ ఎక్కువవుతున్న నిరుద్యోగిత మధ్య ఎక్కువ మంది పిల్లల విధానం విషయంలో ఆశించిన స్దాయిలో స్పందన లేదని తెలుస్తోంది. ఇదే అంశంపై సీఎం చంద్రబాబు (Chandrababu) సైతం ఇవాళ ఓ ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు.
సీనియర్ జర్నలిస్ట్ పాల్కీ శర్మతో జరిగిన ఇంటర్వ్యూలో సీఎం చంద్రబాబు ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ఇద్దరు, అంతకంటే ఎక్కువ పిల్లల విధానంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డెమోగ్రాఫిక్ డివిడెండ్ విషయంలో మీ ఆలోచనలు అమలు చేయడం సాధ్యమా అని సీఎం చంద్రబాబును ప్రశ్నించగా.. గతంలో తానే ఒక్కరు లేదా ఇద్దరు పిల్లలు మాత్రమే ఉండాలని చెప్పానని... కానీ ఇప్పుడు తన ఆలోచనలను మార్చుకున్నానని వెల్లడించారు.

ఇద్దరు లేదా అంతకు మించిన పిల్లలు ఉండాలని తాను సూచిస్తున్న విధానాన్ని అమలు చేయడం చాలా కష్టమని చంద్రబాబు ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. కానీ వివిధ దేశాల్లోని పరిణామాలు చూసిన తర్వాత దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తన విధానాలను మార్చుకున్నానని చంద్రబాబు తెలిపారు. అమలు కష్టమైనా సరే... ప్రజలకు మంచి జరుగుతోందని భావిస్తే చెబుతూనే ఉంటానని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. తద్వారా రాష్ట్రంలో ఈ విధానం అమల్లో ఇబ్బందులు ఉన్నట్లు పరోక్షంగా అంగీకరించారు. అయితే ఇందుకు గల కారణాలను మాత్రం చంద్రబాబు వెల్లడించలేదు.













Click it and Unblock the Notifications
