నేడు సింగపూర్, రేపు జపాన్ అని..: బాబుపై ఉమ్మారెడ్డి
హైదరాబాద్/కర్నూలు: ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో ప్రభుత్వం తీరును వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తీవ్రస్థాయిలో తప్పు పట్టారు. రాజధాని నిర్మించనున్న ప్రాంతంలో తమ పార్టీకి చెందిన నేతలు మరోసారి పర్యటిస్తారని ఆయన ఆదివారం చెప్పారు.
చంద్రబాబు చెబుతున్న ల్యాండ్ పూలింగ్ అంటే ప్రజలకు అర్థం కావటం లేదన్నారు. అసలు ప్రభుత్వం చెబుతున్న ల్యాండ్ పూలింగ్‌కు చట్టబద్దత ఉందా అని ప్రశ్నించారు. చంద్రబాబు ఇప్పుడు సింగపూర్ లాంటి రాజధాని అంటున్నారని, రేపు జపాన్ వెళ్లొచ్చాక.. జపాన్ లాంటి రాష్ట్రమంటారని ఎద్దేవా చేశారు.
కేంద్రం డీనోటిఫై చేస్తామన్న అటవీ భూములను ప్రభుత్వం ఎందుకు పరిగణలోకి తీసుకోవడం లేదన్నారు. ప్రభుత్వం బేషజాలకు పోకుండా అఖిల పక్షంలో రాజధాని పైన చర్చించాలన్నారు. అఖిల పక్షంలో చర్చించాకే రాజధాని కోసం భూములను సేకరించాలన్నారు.

శోభకు అఖిల ప్రియ నివాళులు
దివంగత నేత శోభా నాగిరెడ్డికి కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆదివారం ఉదయం నివాళులు అర్పించారు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారి అఖిల ఆళ్లగడ్డకు వచ్చారు. ఆళ్లగడ్డలో కార్యకర్తలు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆమెకు ఘన స్వాగతం పలికారు.
నిలకడగా ఎమ్మెల్యే వెంకటరమణ ఆరోగ్యం
తిరుపతి టీడీపీ ఎమ్మెల్యే వెంకటరమణ ఆరోగ్యపరిస్థితి నిలకడగా ఉందని స్విమ్స్ ఆస్పత్రి డైరెక్టర్ వెంగమ్మ తెలిపారు. శనివారం రాత్రి కిడ్నీ సమస్యలతో ఆస్పత్రిలో చేరిన వెంకట రమణకు కార్డియాలజీ, నెఫ్రాలజీ, అనస్తీషియా విభాగాల వైద్యుల సమన్వయంతో చికిత్స అందిస్తున్నామని ప్రస్తుతం ఆయనకు డయాలసిస్ కొనసాగిస్తున్నామని వెంగమ్మ తెలిపారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై స్విమ్స్ డైరెక్టర్ వెంగమ్మ ఆదివారం మధ్యాహ్నం హెల్త్ బులిటెన్ విడుదల చేశారు.












Click it and Unblock the Notifications