నక్రేకల్‌లో సాయుధుల కలకలం: ఉగ్రవాద కోణంపై ఆరా?
నల్లగొండ/ హైదరాబాద్: ఇద్దరు గుర్తు తెలియని యువకులు తుపాకీతో తిరిగిన ఘటన నల్లగొండ జిల్లాలోని నకిరేకల్ లో మధ్యాహ్న ప్రాంతంలో తీవ్ర సంచలనం కలిగించింది. బైక్ పై వచ్చిన ఆ యువకులు స్థానికులను తుపాకీతో బెదిరించి పరారయ్యారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఆ ఇద్దరు యువకులు అపాచి బైక్( నెం ఏపీ 13, ఆర్ యూ 4379 )పై వచ్చినట్లు స్థానికులు అధికారులకు వివరించారు. వారు హిందీలో మాట్లాడుతున్నట్లు సమాచారం అందించారు. తుపాకులతో కనిపించిన యువకులకు ఉగ్రవాదులతో ఏమైనా సంబంధాలున్నాయా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఇటీవల నల్లగొండలో జరిగిన ఎదురుకాల్పుల నేపథ్యంలో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు.

హైదరాబాదులోని బేగంబజారులో వ్యాపారిపై దాడి చేసి దోపిడీ చేసి కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.1.05 లక్షలు, ద్విచక్రవాహనం స్వాధీనంచేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను రిమాండ్‌కు తరలించారు.
వరంగల్ జిల్లాలోని భూపాలపల్లి మండలం మల్లంపల్లిలో వేగంగా వస్తున్న ఓ టిప్పర్ కారును ఢీకొన్న సంఘటనలో ఇద్దరు బీటెక్ విద్యార్థులు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications