UNION BUDGET 2021- 2022 : కేంద్ర బడ్జెట్ పై గంపెడాశలు పెట్టుకున్న ఆంధ్రప్రదేశ్ .. ఈ సారైనా న్యాయం జరిగేనా?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నేడు కేంద్ర బడ్జెట్ నేపధ్యంలో బడ్జెట్ లో ఏపీ కేటాయింపులపై గంపెడాశలు పెట్టుకుంది . ఏపీలో రెండు తెలుగు రాష్ట్రాలు విభజన జరిగి ఇంత కాలం అయినా విభజన హామీలు ఇప్పటికీ నెరవేరలేదు. లోటు బడ్జెట్ రాష్ట్రంగా ప్రయాణం ప్రారంభించిన ఏపీ ఇంకా పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయింది. ఏపీకి రావాల్సిన పెండింగ్ గ్రాంట్లు కూడా రాక ఏపీ సర్కార్ కుదేలవుతుంది . ఇక తాజా బడ్జెట్ కేటాయింపులపై ఆశగా ఎదురు చూస్తుంది.

పోలవరం ప్రాజెక్ట్ , రాష్ట్రానికి రావాల్సిన రెవిన్యూ లోటు గ్రాంట్ పై ఆశలు
కేంద్ర బడ్జెట్ పై గంపెడు ఆశలు పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆశగా ఎదురు చూస్తోంది. రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్న విధంగా జాతీయ సంస్థలకు గ్రాంట్ల రూపంలో తగినన్ని నిధులను కేటాయించడంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆశలు పెట్టుకుంది. ఈ బడ్జెట్ లో అయినా కేంద్రం ఆంధ్రప్రదేశ్ కు న్యాయంగా రావాల్సిన నిధులను కేటాయిస్తుందని ఎదురుచూస్తుంది.
జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం ప్రాజెక్ట్ కు తగిన నిధులను కేటాయించడంతో పాటుగా, రాష్ట్రానికి రావాల్సిన రెవిన్యూ లోటు గ్రాంటు నిధులకు సంబంధించి ఈ బడ్జెట్ లో అయినా కేటాయింపులు చేస్తుందని ఎదురుచూస్తోంది.

వెనుకబడిన జిల్లాల అభివృద్దికి గ్రాంట్స్ కోసం ఎదురు చూపులు
అంతేకాదు వెనకబడిన జిల్లాలకు నిధుల కేటాయింపుపై కూడా ఆశలు పెట్టుకుంది ఏపీ ప్రభుత్వం.
15వ ఆర్థిక సంఘం సిఫార్సుల ఆధారంగా ఏపీకి రావలసిన గ్రాంట్ల విషయంలో బడ్జెట్ లో కేటాయింపులు జరుగుతాయని ఎదురుచూస్తోంది. రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఉన్న విధంగా ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలలో వెనకబడిన 7 జిల్లాలకు ప్రత్యేక అభివృద్ధి సహాయం కింద కేటాయింపులు చెయ్యాలని కోరుతున్న ప్రభుత్వం, ఆ మేరకు ఈ బడ్జెట్లో కేటాయింపులు జరుగుతాయని భావిస్తుంది.

పారిశ్రామిక ప్రోత్సాహకాల కోసం ఎదురుచూస్తున్న ఏపీ
ప్రత్యేక హోదా తో పాటుగా, పారిశ్రామిక ప్రోత్సాహకాలను అందించాలని కోరుతున్న ఏపీ సర్కార్, పారిశ్రామిక ప్రోత్సాహకాలు కింద పదేళ్లపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జిఎస్టి రియంబర్స్మెంట్ చేయాలని, ఇన్ కం టాక్స్ మినహాయింపులు చేయాలని, ఇన్సూరెన్స్ ప్రీమియం 100% రీ యింబర్స్మెంట్ లను కేంద్ర బడ్జెట్ లో ప్రకటించాలని కోరుతోంది. ఇక సర్కార్ వీటి విషయంలో కేంద్ర బడ్జెట్ లో ఏవైనా ప్రకటనలు ఉంటాయేమోనని ఆశావహ దృక్పథంతో ఎదురుచూస్తుంది.

కొత్త మెడికల్ కాలేజీలు , పోర్ట్ , స్టీల్ ప్లాంట్ కోసం కేంద్రం నిధులు ఇస్తుందా ?
రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీలు ఏర్పాటు అనుమతించాలని ఏపీ ప్రభుత్వం కోరుతున్న కారణంగా బడ్జెట్ లో కొత్త మెడికల్ కాలేజీలకు సంబంధించిన నిధులను కేటాయిస్తారని కూడా ఆశిస్తుంది. వైయస్సార్ కడప స్టీల్ ప్లాంట్, అలాగే దుగ్గరాజపట్నం పోర్టు లకు సంబంధించిన నిధుల కోసం ఎదురుచూస్తోంది. రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన విద్య, వైద్య సంస్థలకు ప్రత్యేకమైన కేటాయింపులను కేంద్ర సర్కార్ ఇవ్వాలని ఏపీ సర్కార్ కోరుతోంది.

15 వ ఆర్థిక సంఘం సిఫార్సుల ద్వారా అయినా స్పెషల్ గ్రాంట్స్ ఇస్తుందా ? ఎదురు చూపు
ఇక 15 వ ఆర్థిక సంఘం సిఫార్సులు ద్వారా ఈ ఏడాది ఏమైనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్ర చెల్లింపుల విషయంలో ఉపశమనం దొరుకుతుందా అన్నది కూడా ఈ బడ్జెట్ ద్వారా తేలనుంది. కొంతమేరకు స్పెషల్ గ్రాంట్లు మంజూరు చేస్తే తాజా పరిణామాల నేపథ్యంలో, ప్రస్తుతం ఏపీ ఉన్న ఆర్థిక సంక్షోభం నుండి కాస్త రిలీఫ్ దొరుకుతుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆశ గా చూస్తోంది.