ఏరికోరి ఏపీకి మోదీ వరం- కేంద్ర మంత్రివర్గం ఆమోదం
కేంద్ర మంత్రివర్గ సమావేశం కొద్దిసేపటి కిందటే ముగిసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ ఉదయం సమావేశమైన కేంద్ర కేబినెట్.. ఏపీకి భారీగా వరాలు ఇచ్చింది. అత్యధిక ఎంపీలను అందించి.. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు కావడానికి కీలకంగా వ్యవహరించిన ఏపీతో పాటు ఒడిశా, పంజాబ్ పైనా వరాల జల్లును కురిపించింది.
కేంద్ర కేబినెట్ నిర్ణయాలను సమాచార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించింది. దీని ప్రకారం.. నాలుగు కొత్త సెమీకండక్టర్ తయారీ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ఇవి ఇండియా సెమీకండక్టర్ మిషన్ పరిధిలోకి వస్తాయి. ఈ ప్రాజెక్టుల వల్ల దేశీయ ఎలక్ట్రానిక్స్ తయారీ రంగానికి గణనీయమైన ప్రోత్సాహాన్ని అందించినట్టవుతుంది. ఈ రంగంలో భారత్ అగ్రగామిగా ఎదగగలుగుతుంది.

ఆమోదించబడిన ప్రతిపాదనలలో సిక్ సెమ్ కాంటినెంటల్ డివైస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, 3డీ గ్లాస్ సొల్యూషన్స్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్, అడ్వాన్స్‌డ్ సిస్టమ్ ఇన్ ప్యాకేజీ టెక్నాలజీస్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టులు దేశంలో సెమీకండక్టర్ ఉత్పత్తి సామర్థ్యాన్ని భారీగా పెంచుతాయి.
ఈ కొత్త తయారీ యూనిట్లు ఏపీ, ఒడిశా, పంజాబ్ లల్లో ఏర్పాటు కానున్నాయి. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను ప్రధాని మోదీ సారథ్యంలో ఏర్పాటైన కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. వీటి మొత్తం పెట్టుబడి 4,594 కోట్ల రూపాయలుగా అంచనా వేశారు. ఈ పెట్టుబడులు ఆయా రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేస్తాయి.
ఈ ప్రాజెక్టుల ద్వారా వేలాదిమందికి ఉపాధి లభిస్తుంది. అలాగే- సెమీ కండక్టర్లు, దాని అనుబంధ చిన్న, మధ్య తరహా యూనిట్లు ఏర్పాటు కావడానికి కారణమౌతాయి. ఈ రంగంలో నైపుణ్యం కలిగిన వారికి ఉద్యోగ అవకాశాలను మరింత పెంచినట్టవుతుందనే అభిప్రాయాలు ఉన్నాయి.
దేశీయ ఎలక్ట్రానిక్ తయారీ పర్యావరణ వ్యవస్థను సైతం ఇది మరింత బలోపేతం చేస్తుంది. ఈ తాజా ఆమోదంతో ఇండియా సెమీకండక్టర్ మిషన్ కింద మొత్తం ప్రాజెక్టుల సంఖ్య 10కి చేరింది. ఆరు రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న ఈ ప్రాజెక్టుల మొత్తం పెట్టుబడి సుమారు రూ. 1.60 లక్షల కోట్లుగా ఉంది. ఇది భారతదేశం సెమీకండక్టర్ హబ్‌గా మారడానికి దోహదపడుతుంది.












Click it and Unblock the Notifications