ఏపీ తప్ప..అన్ని రాష్ట్రాలకూ బెర్త్: వైఎస్ జగన్‌కు మోడీ ఇచ్చిన సంకేతమేంటీ?
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒకింత ఝలక్ ఇచ్చినట్టే కనిపిస్తోంది. ఏపీ నుంచి ఏ ఒక్కరికీ కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో చోటు కల్పించలేదు. దక్షిణాదిన అన్ని రాష్ట్రాలకూ కేంద్ర కేబినెట్‌లో ప్రాధాన్యత ఇచ్చారు.. ఒక్క ఏపీకి తప్ప. ఏపీకి మొండిచెయ్యి ఇవ్వడం పట్ల మిశ్రమ స్పందన కనిపిస్తోంది. బీజేపీ ఏపీ పట్ల సవతి తల్లి ప్రేమ చూపించిందనే విమర్శలు వ్యక్తమౌతోన్నాయి. అదే సమయంలో వైఎస్ జగన్ అంగీకరించి ఉంటే.. ఆ కొరత తీరి ఉండేదనే అభిప్రాయాలు సైతం వినిపిస్తోన్నాయి.

తమిళనాడు నుంచీ
దక్షిణాదిన ఏపీకి తప్ప అన్ని రాష్ట్రాలకూ కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కింది. కేరళ నుంచి మురళీధరన్ ఇప్పటికే విదేశాంగ మంత్రిత్వ శాఖ సహాయమంత్రిగా కొనసాగుతోన్నారు. తమిళనాడు నుంచి కొత్తగా ఎల్ మురుగన్‌కు కేబినెట్ బెర్త్ ఇచ్చారు మోడీ. మద్రాస్ హైకోర్టు న్యాయవాదిగా సుమారు 15 సంవత్సరాలకుపైగా అనుభవం ఉంది ఆయనకు. షెడ్యూల్డ్ కులాల జాతీయ కమిషన్‌కు ఉపాధ్యక్షునిగా పనిచేశారు. మద్రాస్ యూనివర్శిటీ నుంచి న్యాయ విద్యలో పీహెచ్‌డీ పూర్తి చేసిన ఉన్నత విద్యావంతుడాయన.
కర్ణాటక నుంచి అయిదుమంది..
మన పొరుగునే ఉన్న కర్ణాటక నుంచి మొత్తంగా అయిదుమంది కేంద్ర కేబినెట్‌లో చోటు సంపాదించుకున్నట్టయింది. కొత్తగా నలుగురిని తీసుకున్నారు. కర్ణాటక నుంచి రాజ్యసభకు ఎన్నికైన మలయాళీ రాజీవ్ చంద్రశేఖర్, ఉడుపి-చిక్‌మగళూరు ఎంపీ శోభా కరంద్లాజె, చిత్రదుర్గ ఎంపీ ఏ నారాయణ స్వామి, బీదర్ లోక్‌సభ సభ్యుడు భగవంత్ ఖుబాకు కేబినెట్ బెర్త్ కల్పించారు. ఇప్పటిదాకా కర్ణాటకకు ప్రాతినిథ్యాన్ని వహించిన సదానంద గౌడకు ఉద్వాసన పలికినప్పటికీ.. కర్ణాటక నుంచే రాజ్యసభకు ఎంపికైన ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్ కొనసాగుతోన్నారు.
తెలంగాణకు మరింత ప్రాధాన్యత..
తోటి తెలుగు రాష్ట్రం తెలంగాణకు కూడా కేంద్ర కేబినెట్‌లో ప్రాధాన్యతే లభించింది. ఇప్పటిదాకా హోం శాఖ సహాయమంత్రిగా పనిచేసిన జీ కిషన్ రెడ్డి పదోన్నతి పొందారు. సహాయమంత్రి నుంచి కేబినెట్ హోదాకు ఎదిగారు. పెర్‌ఫార్మెన్స్‌ను ఆధారంగా చేసుకుని ప్రధాని మోడీ-అమిత్ షా ఆయనకు ప్రమోషన్ ఇచ్చారు. కొత్తగా ఏర్పాటు చేసిన సహకార మంత్రిత్వ శాఖను కిషన్ రెడ్డికి కేటాయించే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు చక్కర్లు కొడుతోన్నాయి.

ఏపీ నుంచి జీవీఎల్ పేరు వినిపించినా..
ఏపీ నుంచి బీజేపీ సీనియర్ నాయకుడు జీవీఎల్ నరసింహా రావు పేరు బాగా వినిపించింది. మీడియాలో విస్తృతంగా కథనాలు వెలువడ్డాయి. ప్రకాశం జిల్లాకు చెందిన జీవీఎల్ నరసింహా రావు ఉత్తర ప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఏపీ నుంచి ప్రాతినిథ్యాన్ని కల్పించడంలో భాగంగా జీవీఎల్‌ను మంత్రివర్గంలోకి తీసుకుంటారంటూ వార్తలొచ్చినప్పటికీ- అది అవాస్తవమని తేలిపోయింది. ఉత్తర ప్రదేశ్ కోటా భర్తీ కావడం, సామాజిక వర్గం కోణంలో చూసినా జీవీఎల్‌ను ఇండక్ట్ చేయడానికి వీలు కలగలేదనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి.
పరోక్షంగా హెచ్చరికలు పంపించినట్టేనా?
ఈ పరిస్థితుల మధ్య ఇక పూర్తి స్థాయిలో ఎన్డీఏ ప్రభుత్వం వైఎస్ జగన్‌కు దూరం పెట్టినట్టే అయిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. కేంద్ర కేబినెట్‌లో చేరడానికి ప్రధాని మోడీ వైఎస్ జగన్‌కు చివరి అవకాశం సైతం ఇచ్చారని అంటోన్నారు. దీన్ని వైఎస్ జగన్ సద్వినియోగం చేసుకోలేకపోయారనే వాదనలు వినిపిస్తోన్నాయి. చంద్రబాబు తరహాలో కొద్దిరోజుల పాటు కేంద్ర కేబినెట్‌లో పదవుల్లో కొనసాగి.. ఆ తరువాత తన నిర్ణయాన్ని తీసుకుని ఉంటే బాగుండేదనే వారూ లేకపోలేదు. అదే జరిగితే- టీడీపీ తరహాలోనే పార్టీ పరువు ఎటూ కాకుండా పోతుందనే అభిప్రాయం వైసీపీ నేతల్లో వ్యక్తమౌతోంది. ప్రత్యేక హోదాకు కట్టుబడి ఉన్నామని, ఆ డిమాండ్‌ను నెరవేర్చితే.. పదవులను సైతం ఆశించకుండా ఎన్డీఏకు మద్దతు ఇస్తామంటూ వైఎస్ జగన్ ఇదివరకు చేసిన ప్రకటనలను గుర్తు చేస్తోన్నారు.












Click it and Unblock the Notifications