జగన్ కామెంట్స్ కు కిషన్ రెడ్డి కౌంటర్-కోర్టు తీర్పు నచ్చకపోతే...
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అమరావతి స్ధానంలో మూడు రాజధానుల్ని తెచ్చేందుకు చేసిన ప్రయత్నానికి హైకోర్టు తీర్పుతో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దీంతో అసెంబ్లీ అధికారాల్లో కోర్టులు జోక్యం చేసుకోకూడదంటూ నిన్న అసెంబ్లీలో వైసీపీ సర్కార్ చర్చ పెట్టింది. ఇందులో సీఎం జగన్ కోర్టులకు ఉన్న అధికారాల్ని ప్రశ్నించారు. దీనిపై తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సీఎం జగన్ వ్యాఖ్యలపై స్పందించారు.
సీఎం జగన్ కోర్టులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై స్పందించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.. కోర్టుల్ని అందరూ గౌరవించాలని అన్నారు. జగన్ కు ఒకవేళ అమరావతిపై హైకోర్టు ఇచ్చిన తీర్పు నచ్చకపోతే సుప్రీంకోర్టుకు వెళ్లాలని ఆయన సూచించారు. జగన్ కు ఆ అవకాశం ఉందని కిషన్ రెడ్డి గుర్తుచేశారు. అలా కాకుండా వ్యవస్ధల్ని ఎవరూ ఎప్పుడూ దెబ్బతీయకూడదని పరోక్షంగా జగన్ సర్కార్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. శాసన, న్యాయ, కార్యనిర్వాహక పత్రికా వ్యవస్ధలను కాపాడుకునే బాధ్యత అందరిపైనా ఉందని కిషన్ రెడ్డి గుర్తుచేశారు.

అమరావతి రాజధానిపై ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ నిన్న అసెంబ్లీలో మాట్లాడిన మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు, సీఎం జగన్.. జడ్డీల తీరుపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. హైకోర్టు తీరు అసెంబ్లీ అధికారాల్లో జోక్యం చేసుకునేలా ఉందన్నారు. చట్టాలకు సంబంధించి అసెంబ్లీయే సుప్రీం అని. దాని అధికారాల్లో జోక్యం చేసుకునే హక్కు కోర్టులకు లేదన్నారు. తద్వారా అమరావతిపై హైకోర్టు ఇచ్చిన తీర్పు అమలు చేయబోమని, మూడు రాజధానులకే తాము మొగ్గుచూపుతున్నట్లు చెప్పకనే చెప్పారు.












Click it and Unblock the Notifications