వైజాగ్ స్టీల్ పై ఇలా ! ప్రత్యేక హోదాపై అలా ! తేల్చేసిన కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ..!
ఏపీలో తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘన విజయం తర్వాత కేంద్ర ఉక్కు శాఖ సహాయమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నరసాపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాసవర్మ.. ఇవాళ రాష్ట్రానికి చెందిన రెండు కీలక అంశాలపై స్పందించారు. ముఖ్యంగా ఎన్నికల అంశంగా కూడా మారిన విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణతో పాటు ప్రత్యేక హోదాపై తమ స్టాండ్ ఏంటో తేల్చిచెప్పేశారు.
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో దీనిపై తిరిగి కేంద్రంతో మాట్లాడతానని ఉక్కు శాఖ సహాయ మంత్రి అయిన శ్రీనివాసవర్మ హామీ ఇచ్చారు. స్టీల్ ప్లాంట్ ఏపీ ప్రజలకు సెంటిమెంట్తో కూడుకున్నదని వ్యాఖ్యానించారు. కాబట్టి ప్రైవేటీకరణ ఆపేలా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతానన్నారు.
ప్రజలకు మేలు జరిగేలా అడుగులు వేస్తానని హామీ ఇచ్చారు.

అలాగే ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ పై కూడా కేంద్రమంత్రి వర్మ స్పందించారు. ప్రత్యేక హోదా ముగిసిపోయిన అంశమని తేల్చిచెప్పేశారు. ఏపీకి కేంద్రం స్పెషల్ ప్యాకేజీ ఇచ్చిందని ఆయన గుర్తుచేశారు. కాబట్టి ఇక ప్రత్యేక హోదా చర్చ లేదన్నారు.
మరోవైపు రాబోయే ఐదేళ్లు కూటమితో కలిసి ముందుకెళ్తామని శ్రీనివాసవర్మ తెలిపారు. సమస్యలతో సంబంధం లేకుండా కూటమితో కలిసి ప్రయాణం సాగిస్తామన్నారు. దీంతో వర్మ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.












Click it and Unblock the Notifications