అమరావతికి భూములివ్వం.. ! ససేమిరా అంటున్న ఆ గ్రామాలు..!
ఏపీలో అమరావతి రాజధాని నిర్మాణానికి వేగంగా అడుగులు వేస్తున్న చంద్రబాబు సర్కార్ రెండో విడతలో దాదాపు 30 వేల ఎకరాలకు పైగా భూములు సమీకరించాలని తాజాగా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అమరావతి గ్రామాల్లో గ్రామసభలు పెట్టి భూములు ఇవ్వాలని రైతుల్ని అడుగుతున్నారు. అయితే తొలి దశలో తీసుకున్న భూములకే ఇంకా న్యాయం చేయలేదని, ఇప్పుడు రెండో విడతలో తాము భూములిస్తే ఎప్పటికల్లా న్యాయం జరుగుతుందని రైతులు ప్రశ్నిస్తున్నారు.
అమరావతి రాజధాని కోసం రెండో విడతలో భూసమీకరణ చేయాలని నిర్ణయించిన గ్రామాల్లో పెదపరిమి, వడ్లమాను, హరిచంద్రపురం కూడా ఉన్నాయి. ఇక్కడి రైతులు భూసమీకరణను వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలు చోట్ల నిర్వహించిన గ్రామ సభల్లో వీరు తమ అభిప్రాయాలను నిష్కర్షగా ప్రభుత్వానికి చెప్పేస్తున్నారు. అయితే వీరిని నయానో భయానో ఒప్పించేందుకు టీడీపీ నేతలు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.

ప్రభుత్వం చేపట్టిన రెండో విడత భూసమీకరణకు తమ భూములు ఇచ్చేది లేదంటూ పెదపరిమిలో ఆదివారం రైతులు సాయంత్రం మైక్ ప్రచారం చేయించారు. రాజధాని ప్రాంతంలో మొదటి విడత భూ సమీకరణలో భాగంగా రైతుల నుండి సేకరించిన భూమికి బదులుగా ఇచ్చిన రైతుల రిటర్నబుల్ ప్లాట్లు అభివృద్ధి చేసి, ఆ తర్వాతే రెండవ దశ భూ సమీకరణ గురించి ప్రభుత్వం ఆలోచించాలని వారు కోరుతున్నారు. ఇప్పటికే మొదటి దశలో భూ సమీకరణ చేసి 10 సంవత్సరాలకు పైగా గడిచినా రాజధాని ప్రాంతంలో కొందరి రైతుల ప్లాట్లు ఎక్కడ ఉన్నాయో అర్థం కాని అయోమయ పరిస్థితి నెలకొందని వారు ఆరోపిస్తున్నారు.

రాజధాని కోసం రెండో విడత పూలింగ్ లో భూములు తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించిన గ్రామాలలో ఇవాళ సిపిఎం బృందం పర్యటించింది. పెదపరిమి, వడ్లమాను, హరిచంద్రపురం గ్రామాలలో సిపిఎం బృందం పర్యటించింది. సీపీఎం బృందం ఎదుట రెండో విడత పూలింగ్ విషయమై రైతులు అనుమానాలు వ్యక్తం చేశారు. మొదట సమీకరించిన ప్రాంతంలోనే రైతుల ప్లాట్లలో అభివృద్ధి జరగని నేపథ్యంలో మరో 30 వేల ఎకరాలకు పైగా భూములు సమీకరించాల నే ప్రభుత్వ ఆలోచన వల్ల రాజధాని ప్రాంత అభివృద్ధికి విఘాతం కలుగుతుందని రైతాంగం ఆందోళన చెందుతున్నారని వారు చెప్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో ప్రభుత్వం రెండవ దశ భూ సమీకరణను విరమించుకోవాలని కోరుతున్నారు.
అమరావతే రాజధాని అని నిర్ణయిస్తూ పార్లమెంట్లో చట్ట సవరణ చేయకపోవడం వల్ల గత ప్రభుత్వ హయాంలో రాజధాని అస్తిత్వమే సందిగ్ధంలో పడిందని, భవిష్యత్తులో ఇలాంటి వాటికి అవకాశం లేకుండా పార్లమెంట్లో దీనిపై చట్ట సవరణ చేసి గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. అలాగే రాజధాని ఏర్పాటు సందర్భంగా గతంలో ఈ ప్రాంత నిరుద్యోగులందరికీ ఇంటికి ఒక ఉద్యోగం కల్పిస్తా మనీ హామీ ఇచ్చారని, ఈ ప్రాంతంలో వచ్చే పెద్ద, చిన్న సంస్థలన్నింటిలోనూ స్థానికంగా ఉన్న నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడం ద్వారా ఆ హామీని అమలు చేయాలని కోరుతున్నారు.












Click it and Unblock the Notifications