నాకే దిక్కులేదు... ఇక నీకెలా ఇప్పిస్తానయ్యా సామీ!?
వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అందుకు తగ్గట్లుగా వ్యూహాలను రూపొందిస్తున్నారు. అధికారానికి అన్నింటికన్నా ముఖ్యమైంది అభ్యర్థులను ఎంపిక చేయడం. గతంలో నామినేషన్ల గడువు ముగిసే గంట, రెండు గంటల సమయానికి ముందుగా అభ్యర్థులను ఖరారు చేసిన చరిత్ర ఉంది. ఇది చంద్రబాబు సహజ స్వభావం అని తెలుగు తమ్ముళ్లంతా వ్యాఖ్యానిస్తుండేవారు.

సహజశైలికి భిన్నంగా..
ఈసారి మాత్రం తన సహజశైలికి భిన్నంగా ఏడాదిన్నర ముందుగానే అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు. అయితే ఖరారు చేసే క్రమంలో ఎవరికి పడితే వారికి సీట్లు ఇవ్వడంలేదు. కచ్చితంగా గెలుస్తారు అనుకున్న గెలుపు గుర్రాలకే టికెట్లు కేటాయిస్తున్నారు. అంతేకాకుండా గతంలో సీనియర్ నేతలు సిఫార్సు చేస్తే కొన్ని సీట్లు ఇచ్చేవారు. ఈసారి అటువంటి నియమాన్ని పక్కన పెట్టారు. సిఫార్సు చేయించుకున్నవారు కాదు కదా.. సీనియర్లకే టికెట్ లేకుండా పోతోంది. దీంతో తమ సీట్లు ఖరారు చేసుకునేందుకు సీనియర్ నేతలంతా చంద్రబాబు దగ్గరకు పరుగులు పెడుతున్నారు.

ఉమ్మడి తూర్పు గోదావరిలో..
ప్రతి నియోజకవర్గానికి సంబంధించిన సమాచారాన్ని పూర్తిగా తన దగ్గర ఉంచుకొని టికెట్లు కేటాయిస్తున్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు సీనియర్ల పరిస్థితి అయోమయంలో ఉంది. ఈ ముగ్గురు చంద్రబాబుకు సన్నిహితులు.. అంతేకాదు సీనియర్ నేతలు. గతంలో ఈ ముగ్గురు నేతల చేతులమీదగా సీట్లు పొందినవారున్నారు. అయితే ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. తునిలో కాపులకు లేదంటే శెట్టి బలిజలకు సీటు కేటాయించాలని చూస్తున్నారు.

కాకినాడ ఎంపీ సీటు రిజర్వు?
అలాగే పెద్దాపురంలో కమ్మ సామాజికవర్గానికి ఇవ్వాలనే డిమాండ్ వస్తోంది. ఒకవేళ అదే జరిగితే నిమ్మకాయల చినరాజప్పను రాజానగరం పంపించే అవకాశం ఉంది.
జ్యోతుల నెహ్రూ కుటుంబానికే జగ్గంపేట సీటు ఉన్నప్పటికీ ఆయన తనయుడు నవీన్ కాకినాడ ఎంపీ సీటును కోరుతున్నారు. అయితే అది ఇవ్వడానికి బాబు సిద్ధంగా లేరని తెలుస్తోంది. చివరి నిముషంలో చోటుచేసుకోబోయే రాజకీయ పరిణామాల్లో భాగంగా కాకినాడ ఎంపీ సీటును రిజర్వు చేసి పెట్టారు.












Click it and Unblock the Notifications