ఇలాగైతే 2019లోనూ: విహెచ్, పక్షిలాగేనన్న జైపాల్
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ బీసీ వర్గానికి ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లను కేటాయించకపోతే 2019 ఎన్నికల్లో కూడా నష్టపోతుందని ఆ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు అన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ‘కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ కార్యాచరణ సదస్సు' రెండో రోజు కొనసాగింది.
ఈ సమావేశంలో పాల్గొన్న విహెచ్ మాట్లాడుతూ.. పార్టీ పదవుల్లో బీసీలకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని, లేదంటే వారు కాంగ్రెస్ నమ్మరని తెలిపారు. బీసీలకు సబ్ ప్లాన్ అంశంపై పోరాడాలని విహెచ్ అన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ దిగ్విజయ్ సింగ్ ఉన్నారు.

పక్షిలాగే: జైపాల్ రెడ్డి
దేశ ప్రజలు మార్పు కోరుకోవడం వల్లే కేంద్రంలో యుపిఏ ఓటమి పాలైందని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి అన్నారు. భవిష్యత్ కార్యాచరణ సదస్సులో ఆయన మాట్లాడుతూ.. పక్షిలాగా కాంగ్రెస్ మళ్లీ పైకి లేస్తుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆత్మవిశ్వాసం కోల్పోవద్దని అన్నారు. పరాజయాలను కొత్త స్ఫూర్తిగా తీసుకోవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్సే తెలంగాణ ఇచ్చిందన్న విషయాన్ని ప్రతి గ్రామాన చాటాలన్నారు.
టిఆర్ఎస్ సర్కారు ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చిందని చెప్పారు. వాటిని ప్రజలు నమ్మడం వల్లే టిఆర్ఎస్ గెలిచిందన్నారు. రుణమాఫీ విషయంలో రిజర్వు బ్యాంకు ఒప్పుకోవడం లేదనే సాకులు చెప్పకుండా.. ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ బిల్లును నరేంద్ర మోడీ, అద్వానీ బహిరంగంగానే వ్యతిరేకించారని చెప్పారు. టిఆర్ఎస్ పార్టీకి సెక్యూలరిజంపై నమ్మకం లేదని, ప్రాంతీయ పార్టీలు సిద్ధాంతాలకు కట్టుబడి ఉండటం లేదని ఆరోపించారు. సెక్యూలర్ పార్టీలని చెప్పుకున్న టిడిపి, డిఎంకెలు బిజెపితో పొత్తుకున్నాయని, భవిష్యత్‌లో టిఆర్ఎస్ పార్టీ కూడా పొత్తుపెట్టుకోదనే గ్యారంటీ లేదన్నారు.
ఇది ఇలా ఉండగా, రేషన్ కార్డులు రద్దయితే ఆ బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానిదేనని మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత టి జీవన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ సదస్సులో పాల్గొన్న జీవన్ రెడ్డి మాట్లాడారు. సిఎం కె చంద్రశేఖర్ రావు లెక్కల ప్రకారమే 16 లక్షల కుటుంబాలకు రేషన్ కార్డులు లేవని తెలిపారు. సంక్షేమ పథకాల అమలు కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని ఆయన చెప్పారు. స్థానిక ప్రజాప్రతినిధులు ఫిరాయింపులు ఆగాలంటే ప్రత్యక్ష ఎన్నికలు రావాల్సిందేనని అభిప్రాయపడ్డారు. ఎంపిటిసి, జడ్పిటిసిల ఫిరాయింపు ఆగాలంటే మండల, జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవులకు ప్రత్యక్ష ఎన్నికలు జరగాల్సిందేనని అన్నారు.












Click it and Unblock the Notifications