వంగవీటి జోలికొస్తే ఖబడ్డార్-రాధా హత్య కుట్రపై అన్న నరేంద్ర వార్నింగ్- ఏ క్షణమైనా
విజయవాడ రాజకీయాల్లో వంగవీటి కుటుంబానికి ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. ఒకప్పుడు వంగవీటి రంగా పేరు రాష్ట్రమంతా వినిపించేది. ఆయన హత్య తర్వాత వారసుడిగా రాధా రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన మరో సోదరుడు నరేంద్ర కూడా బీజేపీలో ఉన్నారు. అయితే రాధాతో పలు విషయాల్లో విభేదించే సోదరుడు నరేంద్ర.. తాజాగా రాధా హత్యకు కుట్ర జరుగుతోందంటూ వచ్చిన వార్తలపై తీవ్రంగా స్పందించారు. వంగవీటి కుటుంబం జోలికొస్తే ఖబడ్డార్ అంటూ హెచ్చరికలు చేశారు.

వంగవీటి రాధా వ్యాఖ్యలు
ఒకప్పుడు కాంగ్రెస్, వైసీపీల్లో ఉన్న వంగవీటి రాధా గత ఎన్నికల ముందు టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు. అయితే ఆయన ఏ పార్టీలో ఉన్నా చేసే వ్యాఖ్యలు మాటలు మాత్రం తూటాల్లా పేలుతుంటాయి. ఇదే క్రమంలో తాజాగా ఆయన తన హత్యకు కుట్ర జరుగుతోందంటూ వ్యాఖ్యానించారు.
తన తండ్రి వంగవీటి రంగా విగ్రహం సాక్షిగా తన హత్యకు కుట్ర జరుగుతోదంటూ చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా కాకరేపాయి. దీంతో రంగా హత్య తర్వాత ఇన్నాళ్లకు రాధా హత్యకు ఎవరు కుట్ర చేస్తున్నారనే చర్చ మొదలైంది. అయితే దీనిపై రాధా క్లారిటీ ఇవ్వకపోయినా వంగవీటి కుటుంబం ప్రత్యర్ధులు ఎవరో అందరికీ తెలుసు కాబట్టి ఈ చర్చ మరింత ముదురుతోంది.

రాధా వ్యాఖ్యలపై సోదరుడు నరేంద్ర రియాక్షన్
ఎన్నడూ లేని విధంగా తన హత్యకు కుట్ర జరుగుతోందంటూ స్వయంగా వంగవీటి రాధా ప్రకటన చేసిన నేపథ్యంలో బీజేపీలో ఉన్న ఆయన సోదరుడు వంగవీటి నరేంద్ర స్పందించారు. వంగవీటి కుటుంబం టార్గెట్ గా జరుగుతున్న కుట్రలపై ఆయన మాట్లాడారు. గతంలో తాను కూడా వంగవీటి రాధాతో ఓ విషయంలో విభేదించానని, కానీ ఇప్పుడు రాధాకు వ్యతిరేకంగా హత్య కుట్ర జరుగుతుంటే మాత్రం చూస్తూ ఊరుకోలేనన్నారు.

ఏ క్షణమైనా వస్తానన్న నరేంద్ర
రాజకీయంగా తనకూ, తన తమ్ముడు వంగవీటి రాధాకూ ఎన్ని విభేదాలైనా ఉండొచ్చని, కానీ తన కుటుంబాన్ని,తమ్ముడిని కాపాడుకోవాల్సిన బాధ్యత తనకుందని వంగవీటి నరేంద్ర వ్యాఖ్యానించారు. తన తమ్ముడిని కాపాడుకునేందుకు ఏ క్షణమైనా వచ్చి అండగా నిలబడతానని నరేంద్ర తెలిపారు. తన తమ్ముడు రాధాపై ఎలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దని నరేంద్ర వంగవీటి కుటుంబ ప్రత్యర్ధులకు హెచ్చరికలు పంపారు.

వంగవీటి జోలికొస్తే ఖబడ్డార్
వంగవీటి కుటుంబం జోలికొస్తే, తమ్ముడు రాధా జోలికొస్తే మొట్టమొదట నిలబడేది నేనేనని నరేంద్ర తెలిపారు. గతంలో తాను ఓ విషయంలో విభేదించానని నరేంద్ర చెప్పారు. అదీ రంగా హత్యకు టీడీపీ కారణం కాదని రాధా చెప్పినందుకు మాత్రమే విభేదించానని, కానీ ఇప్పుడు రాధాను చంపుతామంటే చూస్తూ ఊరుకోబోనన్నారు. తమ్ముడికి, వంగవీటి కుటుంబానికి జరిగే ఎలాంటి కుట్రలనైనా తిప్పికొడతామని నరేంద్ర హెచ్చరికలు జారీ చేశారు. గతంలో తమ్ముడితో విభేదించినా ఇప్పుడు కీలక సమయంలో రాధాకు నరేంద్ర అండగా నిలవడంపై రంగా-రాధా మిత్రమండలి, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications