ఏ సీఎం అయినా చేశారా?, ఏపీ పరువు పోతోంది: చంద్రబాబుపై వాసిరెడ్డి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రజలను నమ్మించడం కోసం చేస్తున్న ఆర్భాటాల వల్ల ఆంధ్రప్రదేశ్ పరువు పోతోందని వాసిరెడ్డి తీవ్రంగా విమర్శించారు.
ఆమె బుధవారం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. పట్టిసీమ పథకాన్ని చంద్రబాబునాయుడు ముచ్చటగా మూడోసారి ప్రారంభించారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఒక పథకాన్ని ఇన్నిసార్లు ఎక్కడైనా ప్రారంభించారా? అని వాసిరెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రం పరువు తీస్తున్నారని మండిపడ్డారు.
ఓ వైపు ముఖ్యమంత్రి మోటార్లు ఆన్ చేయగానే.. మరోవైపు ఇంజినీర్లు వెంటనే స్విఛ్ ఆఫ్ చేశారని ఆరోపించారు. 60కిలోమీటర్లు దాటితే నీళ్లు వెళ్లే పరిస్థితి లేదని, అందుకే ఇంజినీర్లు వెంటనే ఆపేశారని అన్నారు.

ఇదే చిత్తశుద్ధి పోలవరంపై ఉంటే ప్రాజెక్టు సగం పూర్తయ్యేదని వాసిరెడ్డి పద్మ వ్యాఖ్యానించారు. కృష్ణా డెల్టాకు నీరు ఇవ్వలేని సీఎం చంద్రబాబు.. రాయలసీమకు ఎక్కడ నుంచి ఇస్తారన్నారని వాసిరెడ్డి పద్మ నిలదీశారు.
అప్పనంగానే సదావర్తి భూములు: నారాయణ
సదావర్తి సత్రం భూములను టిడిపి ప్రభుత్వం తమ అనుచరులకు అప్పనంగా కట్టబెట్టిందని సిపిఐ నేత నారాయణ ఆరోపించారు. బుధవారం చెన్నైలోని సదావర్తి భూములను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా తమిళనాడులోని తిరుచ్చేరి, తాళంబూర్‌లోని సదావర్తి భూముల వివరాలను తెలుసుకున్నారు.
ఇది ఇలా ఉండగా, చెన్నై నగరంలోని సదావర్తి సత్రానికి చెందిన దాదాపు 22 ఎకరాల భూమిని ఏపీకి చెందిన టిడిపి నాయకుడు చౌకగా కొనుగోలు చేసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ధర్మాన ప్రసాదరావు అధ్యక్షతన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత నిజనిర్ధారణ కమిటీ ఏర్పాటు చేసింది. ఇటీవలే ఈ బృందం ఈ భూములను పరిశీలించి, నివేదికను పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి సమర్పించింది.












Click it and Unblock the Notifications