హైదరాబాద్- విజయవాడ హైవే: ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సూచన..!!
విజయవాడ: ఎగువ పరీవాహక ప్రాంతాల్లో కురుసిన అతి భారీ వర్షాల వల్ల ఉరకలెత్తిన మున్నేరు వాగు.. శాంతించింది. ఇవ్వాళ యాధాతథ స్థాయికి చేరుకుంది. ఈ మధ్యాహ్నం వరకు వరద నీటితో పోటెత్తిన మున్నేరు వాగులో ప్రవాహం తగ్గింది. జాతీయ రహదారిపైకి చేరిన వరద నీరు తగ్గింది. దీనితో హైదరాబాద్-విజయవాడ మధ్య వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు.
కొద్దిరోజులుగా కురుస్తోన్న భారీ వర్షాల వల్ల మున్నేరు వాగు వరద పోటుకు గురైన విషయం తెలిసిందే. హైదరాబాద్-విజయవాడ మార్గంలో నందిగామ మండలం కీసర గ్రామం వద్ద 65వ నంబర్ జాతీయ రహదారిపై వరదనీరు ప్రవహించింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని విజయవాడ నగర పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఈ మార్గంలో రాకపోకలు సాగించే వాహనాలను దారి మళ్లించారు.

ఈ మధ్యాహ్నం నుంచి వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. వరద ప్రభావ ప్రాంతాలు, హైదరాబాద్ - విజయవాడ హైవే పరిస్థితులను ఈ సాయంత్రం విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా పరిశీలించారు. జరిగిన నష్టం గురించి స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు.
వరద తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఈ మార్గంలో వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ తెలిపారు. ఈ మేరకు కొద్దిసేపటి కిందటే తన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌పై దీనికి సంబంధించిన సమాచారాన్ని పోస్ట్ చేశారు.
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై మున్నేరు వాగు వరద ప్రవాహం తగ్గిందని, ఫలితంగా ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాలోని ఐతవరం వద్ద వరద ఉధృతి తగ్గడంతో రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయని తెలిపారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్-విజయవాడ మార్గంలో సర్వీసులను తాము పునరుద్ధరించినట్లు పేర్కొన్నారు.
ఆ మార్గంలో రెగ్యూలర్ సర్వీస్‌లు ప్రస్తుతం యథావిధిగా నడుస్తున్నాయని సజ్జనార్ వివరించారు. మరింత సమాచారం కోసం టీఎస్‌ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033ను సంప్రదించాలని ప్రయాణికులకు సూచించారు. ఎప్పట్లాగే ఈ మార్గంలో టీఎస్ఆర్టీసీ బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications