అన్నీ అమరావతిలోనేనా, హైదరాబాద్‌లా అయితే ఏం లాభం?: వెంకయ్య
న్యూఢిల్లీ: అన్నీ తెచ్చి అమరావతిలో పెట్టడం కూడా సరికాదని, శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ప్రతి జిల్లాకు ఏదో ఒక సంస్థ, పరిశ్రమ లాంటివి ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి ఎం. వెంకయ్య నాయుడు అభిప్రాయపడ్డారు. ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని, ఇది చాలా మంచిదని ఆయన అన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో అన్ని ప్రాంతాలు బాగుండాలని, ఒక్క హైదరాబాద్‌లా తయారైతేదానివల్ల అందరూ సంతోషంగా ఉండలేరని మంత్రి అన్నారు. రాజధాని అంటే విద్య, వైద్యం, ఉద్యోగాల కల్ఫన అని అన్నారు. ఒక మంచి కార్యక్రమం కోసం రైతులు ముందుకు వచ్చి స్వచ్చంధంగా ఏపీ రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చారని, చాలా సంతోషమని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు.
మంగళవారం అమరావతి రాజధాని రైతులు ఆయన కలిశారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీ గురించి ఎవరూ ఆందోళన చెందవద్దని హామీ ఇచ్చారు. కొందరు అనవసరంగా రాజధాని రైతులను రెచ్చగొడుతున్నారని, అలాంటి వారిని నమ్మవద్దని అన్నారు. జరిగిపోయినదాన్ని మళ్లి వెనక్కి తీసుకురాలేమని, ఇప్పడు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామని అన్నారు.

రాజధాని నిర్మాణం, ఏపీ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలు పెద్దగా అభివృద్ధి చెందలేదని అన్నారు. పారిశ్రామిక వేత్తలు కూడా హోదా అడగడం లేదని వెంకయ్య తెలిపారు.
నూతన రాజధాని అమరావతికి భూములు ఇచ్చిన రైతులు, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుని ఢిల్లీలో కలిశారు. బడ్జెట్‌లో క్యాపిటల్ గెయిన్స్ పన్ను నుంచి మినహాయింపు ఇచ్చినందుకు రైతులు వెంకయ్యకు ధన్యవాదాలు తెలిపారు.ఏపీ మంత్రులు కామినేని శ్రీనివాస్, ప్రత్తిపాటి పుల్లారావు, ఎంపీలు మాగంటి బాబు, గల్లా జయదేవ్ రైతుల వెంట ఉన్నారు.












Click it and Unblock the Notifications