వెంకయ్య క్రియాశీలకంగా..? ఎన్నికల వేళ మరోసారి - 2014 రిపీట్ అవుతుందా..!!
వెంకయ్య నాయుడు. ఉపరాష్ట్రపతి హోదాలో అయిదేళ్ల కాలం పూర్తి చేసుకున్నారు. మరోసారి రెన్యువల్ కు అవకాశం దాదాపు లేనట్లే. నాలుగు దశాబ్దాలకు పైగా రాజకీయ అనుభవం ఉన్న ఆయన.. జాతీయ - ఏపీ రాజకీయాల్లో ప్రభావం చూపించారు. తొలి నుంచి ఒకటే సిద్దాంతం.. ఒకటే పార్టీలో కొనసాగే అరుదైన రాజకీయ నేతల్లో ఒకరిగా నిలిచారు. ఇక, బీజేపీ రాజకీయంగా కష్టాల్లో ఉన్న సమయాల్లో.. అనేక రాష్ట్రాల్లో ఆయన ట్రబుల్ షూటర్ గా వ్యవహరించారు.
రాజకీయాల్లో తన భాష - ప్రాసతో కట్టిపడేసే వెంకయ్య అనూహ్య పరిస్థితుల్లో ఉప రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. రాజ్యసభలో బలబలాలు కీలకంగా మారిన వేళ... దక్షిణాది నుంచి ప్రాధాన్యత ప్రధానంగా మారటంతో.. వెంటనే బీజేపీ అధినాయకత్వం వెంకయ్య వైపు మొగ్గు చూపింది.

కీలక పదవితో రాజకీయాలకు దూరం
నిత్యం పర్యటనలు చేస్తూ.. రాజకీయంగా యాక్టివ్ ఉండే వెంకయ్య తొలుత వద్దనుకున్నా .. ఆ తరువాత అంగీకరించక తప్పలేదు. ఉపరాష్ట్రపతిగా అయిదేళ్ల పదవీ కాలం ముగిసింది. ఇప్పుడు వెంకయ్య నాయుడు ఏం చేయబోతున్నారు. అందరిలోనూ ఇది ఆసక్తి కర చర్చక కారణమవుతోంది. రాజకీయంగా ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే వెంకయ్య ... ఉప రాష్ట్రపతి పదవి వీడిన తరువాత తిరిగి తన రాజకీయాల్లో బిజీగా ఉండిపోతారా..లేక, దూరంగానే ఉంటారా అనేది ఈ చర్చల సారాంశం.
ఇప్పటి వరకు పని చేసిన ఉప రాష్ట్రపతుల్లో ఎవరూ తమ పదవులు వీడిన తరువాత రాజకీయాలకు దగ్గర అయిన సందర్భాలు అరుదుగా చెబుతున్నారు. కానీ, దక్షిణాదిన బీజేపీకి వెంకయ్య లాంటి వారి సేవలు అవసరం. ఆయనకు దక్షిణాది రాష్ట్రాల పైన ఉన్న పట్టు ఇతర నేతల్లో కనిపించదు.

తిరిగి యాక్టివ్ అయ్యే అవకాశం ఉందా
దీంతో..ఆయన తిరిగి రాజకీయాల్లో యాక్టివ్ కావాలని ఆయన్ను అభిమానించే నేతలు కోరుకుంటున్నారు. అదే జరిగితే..అడ్డు చెప్పేవారు లేరు. ఇక, ఆ నిర్ణయం వెంకయ్య నాయుడు పైనే ఆధార పడి ఉంటుంది. అయితే.. వెంకయ్య నాయుడు తిరిగి రాజకీయంగా యాక్టివ్ అయితే గతం కంటే కొంత భిన్నంగా వ్యవహరించే అవకాశం ఉంటుంది.
వచ్చే ఎన్నికల్లో వెంకయ్య నాయుడు రాజకీయంగా యాక్టివ్ అయితే, ఏపీ మీద ప్రభావం ఉంటుందనే అభిప్రాయం వినిపిస్తోంది. వెంకయ్యనాయుడు అభిమానులు కోరుకుంటున్నట్లుగా తిరిగి క్రియాశీలకంగా మారితే బీజేపీ ఎవరితో కలవాలి.. పొత్తుల వ్యవహారం పైన కొత్త పరిణామాలు చోటు చేసుకొనే ఛాన్స్ ఉందనే వాదన వినినిపిస్తోంది.

వెంకయ్య నిర్ణయం పైన ఆసక్తి
2014లో ఏపీలో పొత్తుల వెనుక వెంకయ్య కీలకంగా వ్యవహరించిన విషయాన్ని కొందరు రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. కానీ, ఇప్పుడు వెంకయ్య నాయుడు ఆ స్థాయిలో పొత్తుల గురించి జోక్యం చేసుకొనే అవకాశం ఉండదని.. రాజకీయంగా తన అభిప్రాయం అవసరమైతేనే చెప్పేందుకు ముందుకు రావటం మినహా పెద్దగా ప్రత్యక్షంగా చొరవ తీసుకోరని బీజేపీ లోని కొందరు అభిప్రాయపడుతున్నారు.
ఇప్పటికే వెంకయ్య నాయుడు కుటుంబం స్వర్ణ భారతి ట్రస్టు ద్వారా సేవా కార్యక్రమాల్లో నిమగ్నమైంది. ఇక, వెంకయ్యనాయుడు సైతం ఆ ట్రస్టు కార్యకలాపాల్లో బిజీగా మారుతారనే వాదనా వినిపిస్తోంది. దీంతో..అసలు ఉపరాష్ట్రపతి పదవి నిర్వహిస్తున్న వెంకయ్య ఆ తరువాత ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు.. ఏ రకంగా తన అభిమానులకు దగ్గరవుతారనేది ఇప్పుడు ప్రత్యేకించి తెలుగు రాజకీయాల్లో ఆసక్తి కర చర్చకు కారణమవుతోంది.












Click it and Unblock the Notifications