శ్రీగోవిందరాజస్వామి ఆలయంలో 50 కిలోల బంగారం మాయం, విచారణ..!?
తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామి వారి విమాన గోపురం పనుల్లో 50 కిలోల బంగారం మాయం అయిందనే ఆరోపణలు చాల రోజులుగా వినిపిస్తున్నాయి. ఈ ఆరోపణలపై విజిలెన్స్ విభాగం లోతుగా విచారణ జరుపుతోంది. గతంలో ఈ తరహా ఆరోపణల పైన టీటీడీ అధికారులు వివరణ ఇచ్చారు. ఆరోపణలను తోసి పుచ్చారు. అయితే, ఇప్పుడు వీటిని నిగ్గు తేల్చేందుకు తాజాగా విజిలెన్స్ రంగంలోకి దిగింది. బంగారం మాయం లో నిజనిజాలు తేల్చేందుకు విచారణ మొదలు పెట్టింది.
తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయానికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. 2022-23 మధ్యకాలంలో ఈ ఆలయ విమాన గోపురానికి బంగారు తాపడం పనులు చేసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వంద కిలోల బంగారం కేటాయించింది. ఇందులో భాగంగా తొమ్మిది పొరల (9 లేయర్లు)తో తాపడం చేయాల్సి ఉండగా, రెండు పొరలతో సరిపెట్టి దాదాపు సగం బంగారాన్ని మాయం చేసినట్లు ఆరోపణలున్నాయి. విమాన గోపురం పనులకు అసలు కాంట్రాక్టర్ ను కాదని సబ్ లీజు కింద వేరే ఇద్దరికి పనులు అప్పజెప్పినట్లు ఫిర్యాదులు అందాయి. ప్రస్తుతం ఈ అంశాలన్నింటిపై దేవస్థానం విజిలెన్స్ విభాగం విచారణ చేపట్టింది. అప్పటి ఫిర్యాదుదారుల నుంచి వివరాలు సేకరించడంలో నిమగ్నమైంది.

ఇదే సమయంలో బంగారు తాపడం పనులు చేసిన కార్మికులను కూడా విచారించి, ఎన్ని విగ్రహా లు ధ్వంసం చేశారు? బంగారం ఎంత వాడారు? అనే అంశంపై ఆరా తీస్తోంది. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయం అత్యంత పురాతనమైన ఆలయం. సమున్నత గోపురాలతో, అపురూప శిల్ప కళాసంపదతో అలరిస్తున్న ఈ దేవాలయం వెయ్యి సంవత్సరాలకు పైగా నిత్యం పూజలందుకుంటోంది. శయనమూర్తిగా ఉన్న స్వామి వారి దర్శనం అనేక పాపాలను తొలగిస్తుంది. తిరుమల వెళ్లే యాత్రికులు ఇక్కడ స్వామిని దర్శించుకోవడం సంప్రదాయంగా వస్తోంది. నిత్యం వేలాదిమందియాత్రికులతో రద్దీగా ఉండే శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో ఇప్పుడు ఈ ఆరోపణ లు తేల్చేందుకు విజిలెన్స్ విచారణ మొదలు కావటంతో..అసలు ఏం జరిగింది.. ఇందులో వాస్తవం ఏంటి అనేది బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications