సిట్ కు విజయసాయి ఝలక్..! వైసీపీ రీఎంట్రీ ప్రచారం వేళ..!
ఏపీలో ఒకప్పుడు వైసీపీలో చక్రం తిప్పిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి గత ఎన్నికల్లో ఓటమి తర్వాత పూర్తిగా సైలెంట్ అయిపోయారు. చివరికి వైసీపీతో పాటు రాజకీయాలకు సైతం గుడ్ బై చెప్పేసి వ్యవసాయం చేసుకుంటానంటూ ప్రకటించారు. అయితే మధ్యలో వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంపై ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వానికి వరంగా మారాయి. దీంతో సీఐడీ సిట్ అధికారులు ఆయన్ను సాక్షిగా వాడుకునేందుకు నోటీసులు పంపుతున్నారు. గతంలో ఇలా ఓసారి మద్యం స్కాంపై వాంగ్మూలం ఇచ్చిన సాయిరెడ్డికి ఇవాళ మరోసారి రావాలని సమన్లు అందాయి.
అయితే ఇవాళ సిట్ విచారణకు మాత్రం సాయిరెడ్డి వెళ్లలేదు. ఈ మేరకు తాను విచారణకు రాలేకపోతున్నట్లు సిట్ అధికారులకు సాయిరెడ్డి సమాచారం ఇచ్చారు. ముందుగా ఖరారైన కార్యక్రమాల వల్ల విచారణకు రావట్లేదని ఆయన సిట్ అధికారులకు తెలిపారు. అయితే తాను ఎప్పుడు విచారణకు హాజరవుతానో రెండు రోజుల్లో వెల్లడిస్తానని సిట్ కు తెలిపారు. దీంతో సిట్ అధికారులు తదుపరి విచారణకు ఏర్పాట్లు చేస్తున్నారు.

కర్మ చేసే వాళ్లు అనుభవించకతప్పదు, అయితే కర్మ చేయాల్సిందేనంటూ విజయసాయిరెడ్డి ఇవాళ ఎక్స్ లో ఓ పోస్టు కూడా పెట్టారు. దీంతో ఆయన ఎవరిని ఉద్దేశించి ఈ పోస్టు పెట్టారన్నది తేలాల్సి ఉంది. అయితే ఇదే పోస్టులో ఆయన విపక్షాలతో సహా అన్ని రాజకీయ పార్టీలు రాజధర్మం పాటించాలంటూ హిందీలో ఓ వ్యాఖ్యను కూడా జోడించారు. దీంతో వైసీపీని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారా అన్న చర్చ జరుగుతోంది.
विपक्ष सहित सभी राजनीतिक दलों को राज-धर्म का पालन करना चाहिए।
— Vijayasai Reddy V (@VSReddy_MP) July 12, 2025
కర్మణ్యే వాధికారస్తే
మాఫలేషు కదాచన!
మా కర్మఫలహేతుర్భూ:
మా తేసంగోஉస్త్వకర్మణి!!
కర్మలను ఆచరించుట యండే నీకు అధికారము కలదు
కానీ వాని ఫలితముల మీద లేదు.
నీవు కర్మఫలములకు కారణం కారాదు.
అట్లని కర్మలను చేయుట మానరాదు.…
ఇప్పటికే వైసీపీకి దూరమై, రాజకీయాలకు దూరమైన విజయసాయిరెడ్డి ఎక్స్ లో మాత్రం నిత్యం యాక్టివ్ గా ఉంటూ పోస్టులు పెడుతున్నారు. సమకాలీన రాజకీయ అంశాలతో పాటు ఆర్ధిక, సామాజిక అంశాలపై ట్వీట్లు పెడుతున్నారు. అలాగే ప్రభుత్వాలకు మార్గదర్శనం కూడా చేస్తున్నారు. అయితే వీటిపై ఎలాంటి స్పందన వచ్చినా రాకపోయినా ఆయన ట్వీట్లు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే వైసీపీలోకి తిరిగి ఎంట్రీ ఇచ్చేందుకు సాయిరెడ్డి చర్చలు జరుపుతున్నారన్న ప్రచారం కూడా సాగుతోంది. దీనిపై బహిరంగంగా మాత్రం ఆయన నోరు విప్పడం లేదు.












Click it and Unblock the Notifications