చంద్రబాబు బెయిల్,కస్డడీపై ఏసీబీ కోర్టు విచారణ-సుప్రీంలో క్వాష్ పెండింగ్ నేపథ్యంలో !
ఏపీలో స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో అరెస్టు అయిన టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై విజయవాడ ఏసీబీ కోర్టులో ఇవాళ విచారణ ప్రారంభమైంది. చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై వాదనలు వినిపించేందుకు సుప్రీంకోర్టు న్యాయవాది ప్రమోద్ దూబే ఏసీబీ కోర్టుకు వచ్చారు. అలాగే సీఐడీ తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపిస్తున్నారు.
స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్టు తర్వాత సీఐడీ రిమాండ్ రిపోర్ట్ ను ఆమోదించి ఏసీబీ కోర్టు రిమాండ్ కు పంపింది. అనంతరం ఆయన హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఇది హైకోర్టులో పెండింగ్ లో ఉండగానే ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే హైకోర్టు విచారణ పూర్తి కాకపోవడంతో బెయిల్ పై విచారణ పెండింగ్ లో పెట్టిన ఏసీబీ కోర్టు.. హైకోర్టు క్వాష్ పిటిషన్ పై తీర్పు ఇవ్వగానే తిరిగి చేపట్టింది. అయితే సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ నేపథ్యంలో బెయిల్ పిటిషన్ పై విచారణ చేపడుతున్నా వాయిదాలు వేస్తోంది.

అలాగే చంద్రబాబు క్వాష్ పిటిషన్ ను హైకోర్టు కొట్టేయగానే ఆయన్ను కస్డడీకి ఇవ్వాలన్న సీఐడీ అభ్యర్ధనను అంగీకరించిన ఏసీబీ కోర్టు.. రెండు రోజుల పాటు విచారణకు అంగీకరించింది. దీంతో రాజమండ్రి జైల్లో సీఐడీ రెండు రోజుల పాటు చంద్రబాబును ప్రశ్నించింది. తిరిగి ఐదు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని మరో పిటిషన్ దాఖలు చేసింది. సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ పై విచారణ ఆలస్యమవుతున్న నేపథ్యంలో ఇది కూడా ఏసీబీ కోర్టులో పెండింగ్ లో ఉంది. ఇవాళ బెయిల్ తో పాటు కస్టడీ పిటిషన్లపై విజయవాడ ఏసీబీ కోర్టు మరోసారి విచారణ జరుపుతోంది.












Click it and Unblock the Notifications