ఆ 11 కోట్లపై ట్విస్టుల వేళ ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలు..!
ఏపీ మద్యం స్కాం దర్యాప్తులో వరుస ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితుడు రాజ్ కెసిరెడ్డితో పాటు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జగన్ సీఎంవోలో పనిచేసిన పలువురు అధికారులు, వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని నిందితులుగా చేర్చిన సిట్.. వారిని జైలుకు కూడా పంపింది. అలాగే ఇతర నిందితులపై ఫోకస్ పెట్టిన తరుణంలో విదేశాలకు పారిపోతున్న ఏ 40 వరుణ్ పురుషోత్తం ఇచ్చిన సమాచారంతో నిన్న దాడులు చేసి హైదరాబాద్ శివార్లలో 11 కోట్లు సీజ్ చేసింది.
ఈ 11 కోట్ల విషయంలో వైసీపీ పలు అనుమానాలు వ్యక్తం చేస్తోంది. 12 పెట్టెల్లో 11 కోట్లు పట్టుకోవడంపై ప్రశ్నలు సంధిస్తోంది. మరోవైపు ఈ కేసులో ఏ1గా ఉన్న రాజ్ కెసిరెడ్డి దాచి పెట్టిన డబ్బే ఇది అని సిట్ ఆరోపిస్తుండగా.. ఆయన మాత్రం ఈ డబ్బుకూ తనకూ ఎలాంటి సంబంధం లేదని నిన్న కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో విజయవాడ ఏసీబీ కోర్టు ఇవాళ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సిట్ కు ఆదేశాలు ఇచ్చింది.

నిన్న తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా కాచారంలోని ఓ ఫాంహౌస్ లో దొరికిన 11 కోట్ల డబ్బును విజయవాడ మాచవరంలోని స్టేట్ బ్యాంక్ బ్రాంచ్ లో డిపాజిట్ చేయాలని ఏసీబీ కోర్టు సిట్ కు ఆదేశాలు ఇచ్చింది. నిన్న కాచారంలోని ఫామ్ హౌస్ లో తాము 11 సీట్లు సీజ్ చేసినట్లు సీఐడీ సిట్ విభాగం దాఖలు చేసిన మెమోపై స్పందించిన కోర్టు ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఆ డబ్బును స్టేట్ బ్యాంక్ లో డిపాజిట్ చేసేందుకు సిట్ ఏర్పాట్లు చేస్తోంది.
వైసీపీ హయాంలో 3500 కోట్ల మద్యం స్కాం జరిగిందని ఆరోపిస్తున్న సిట్ ఇప్పటివరకూ తొలి విడతలో 60 కోట్ల వరకూ పట్టుకున్నట్లు ఛార్జిషీట్ లో తెలిపింది. ఇప్పుడు 11 కోట్లు దొరికాయని చెబుతోంది. మిగతా డబ్బంతా ఎటు పోయిందో తెలియకుండా ఈ కేసు దర్యాప్తులో ముందుకెళ్లడం కష్టం. అందుకే ఇప్పుడు నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా తదుపరి దర్యాప్తును ముమ్మరం చేస్తోంది. ఇందులో భాగంగా మాజీ సీఎంకు కూడా నోటీసులు ఇచ్చేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications