ఏపీ మద్యం స్కాం నిందితులందరికీ బిగ్ షాక్..!
ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిందని ఆరోపిస్తున్న మద్యం స్కాంలో నిందితులందరికీ ఇవాళ గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో ఇప్పటికే దర్యాప్తు వేగంగా సాగిస్తున్న సిట్ ఇప్పటికే రెండు ఛార్జిషీట్స్ ను కూడా కోర్టులో దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో ఈ కేసులో నిందితులు దాఖలు చేసుకున్న పిటిషన్లపై విజయవాడ ఏసీబీ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. దీంతో వారందరికీ షాక్ తగిలినట్లయింది.
మద్యం స్కాంలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డితో పాటు జగన్ హయాంలో ఆయన కార్యాలయంలో పనిచేసిన ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, అలాగే భారతీ సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప తమకు బెయిల్ ఇవ్వాలంటూ ఏసీబీ కోర్టులో వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. అయితే వీరి బెయిల్ ను సీఐడీ సిట్ అధికారులు అడ్డుకున్నారు. వీరికి బెయిల్ ఇస్తే కీలక దశలో ఉన్న దర్యాప్తుపై ప్రభావం పడుతుందని సిట్ లాయర్లు వాదించారు.

దీంతో ప్రాసిక్యూషన్ వాదనతో ఏకీభవించిన విజయవాడ ఏసీబీ కోర్టు.. ఇవాళ వీరి బెయిల్ పిటిషన్లను తోసిపుచ్చుతూ తీర్పు వెలువరించింది. వీరితో పాటు ఈ కేసులో అరెస్టు కాని ఇతర నిందితులు వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్ దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్లను సైతం విజయవాడ కోర్టు తోసిపుచ్చింది. దీంతో వీరిని సిట్ అధికారులు అరెస్టు చేసేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది.

మద్యం స్కాం కేసులో ఇప్పటికే అరెస్టు అయిన నిందితుల్ని పలుమార్లు కస్టడీకి కూడా తీసుకుని విచారించిన సిట్ అధికారులు వారి నుంచి లభించిన సమాచారం ఆధారంగా రెండు చార్జిషీట్లు దాఖలు చేశారు. అయితే వీటి తర్వాత కూడా ముందుగా ప్రచారం చేస్తున్నట్లుగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ ను నిందితుడిగా కూడా చేర్చలేదు. దీంతో జగన్ అరెస్టు అంటూ గతంలో కూటమి నేతలు చేసిందంతా ఒట్టిదేనని అర్దమైంది. అయితే ఇతర నిందితులకు మాత్రం కష్టాలు తప్పడం లేదు.












Click it and Unblock the Notifications