ఊపిరి పీల్చుకున్న జోగి రమేష్, కొడుక్కి బెయిల్, చంద్రబాబు కేసులో నో బెయిల్
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, వైసీపీ నాయకుడు జోగి రమేష్ తాత్కాలికంగా ఊపిరి పీల్చుకున్నారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ నాయకుడు నారా లోకేష్ ను ఇష్టం వచ్చినట్లు దూషించిన మాజీ మంత్రి జోగి రమేష్, ఆయన కుమారుడు జోగి రాజీవ్ ఆ సమయంలో నిత్యం వార్తల్లో నిలిచారు.
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అగ్రిగోల్డ్ భూముల కొనుగోలు వ్యవహారం కేసు బయటకు వచ్చింది. ఈ అగ్రిగోల్డ్ భూముల కేసులో జోగి రాజీవ్ అరెస్టు అయ్యి విజయవాడ జిల్లా జైల్లో విచారణ ఖైదీగా ఉన్నారు. కుమారుడు రాజీవ్ ను బెయిల్ మీద బయటకు తీసుకురావడానికి మాజీ మంత్రి జోగి రమేష్ లాయర్ల చుట్టూ తిరిగారు. శుక్రవారం విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక కోర్టు జోగి రాజీవ్ కి బెయిల్ మంజూరు చేసింది.

విజయవాడ జిల్లా జైల్లో విచారణ ఖైదీగా ఉన్న జోగి రాజీవ్ ను బయటకు తీసుకురావడానికి ఆయన న్యాయవాదులు ప్రయత్నిస్తున్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నివాసం పై దాడి జరిగిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి జోగి రమేష్ ముందస్తు బెయిల్ కోసం ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. మాజీ మంత్రి జోగి రమేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై వాదనలు ముగిశాయి.
సెప్టెంబర్ 3వ తేదీన తీర్పు ఇస్తామని హైకోర్టు తెలిపింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇంటిపై దాడి జరిగిన కేసులో జోగి రమేష్ పై తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదే కేసులో ముందస్తు బెయిల్ కోసం జోగి రమేష్ అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే రెండుసార్లు పోలీసుల ముందు విచారణకు హాజరైన జోగి రమేష్ పోలీసుల దర్యాప్తుకు సహకరించడం లేదని పోలీసులు ఆరోపిస్తున్నారు. మరోవైపు జోగి రమేష్ కు ముందస్తు బెయిల్ మంజూరు చేయకూడదని పోలీసుల తరపున న్యాయవాది హైకోర్టుకు మనవి చేశారు.












Click it and Unblock the Notifications