భరోసా ఇచ్చిన చంద్రబాబు: క్లీన్ చేయిస్తాం
Vijayawada floods 2024: కనివినీ ఎరుగని విధంగా సంభవించిన విపత్తు.. రెండు తెలుగు రాష్ట్రాలను అల్లకల్లోలానికి గురి చేసింది. అతి భారీ వర్షాల వల్ల ఏపీ, తెలంగాణ దారుణంగా దెబ్బతిన్నాయి. పలు ప్రాంతాలు నీట మునిగాయి. పల్లెలు, పట్టణాలు అనే తేడా ఉండట్లేదు. నదులు, చెరువులు ఏకం అయ్యాయి. జనావాసాలన్నీ జలమయం అయ్యాయి.
ప్రత్యేకించి- రాజధాని అమరావతి మొత్తం నీట మునిగింది. విజయవాడలో ఇదే పరిస్థితి నెలకొంది. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో వరద ఉధృతి నెలకొంది. వేలాదిమందిని ముంపు ప్రాంతాల నుంచి సురక్షిత ప్రదేశాలకు తరలించారు అధికారులు.

ఎగువ పరీవాహక ప్రాంతాల్లో కురిసిన వర్షాల వల్ల కృష్ణానది ఉగ్రరూపాన్ని ధరించింది. వరద నీటితో పోటెత్తింది. బుడమేరుకు వరద ప్రవాహం కొనసాగుతూనే ఉంది. విజయవాడ, అమరావతి ప్రాంతాలు ఇంకా నీటిలోనే నానుతున్నాయి. సింగ్‌నగర్, చిట్టినగర్, సితార, రాజరాజేశ్వరి పేట, యనమలకుదురు, జక్కంపూడి వంటి ప్రాంతాలవాసులు వరద నీటిలో కాలం వెళ్లదీస్తోన్నారు.
ఈ వరదల్లో వందల సంఖ్యలో వాహనాలు దెబ్బతిన్నాయి. కార్లు, ద్విచక్ర వాహనాలు, ఆటోలు.. ఇలా దాదాపు అన్ని రకాల వాహనాలు వరదనీటిలో మునిగాయి. బురదమయం అయ్యాయి. కొన్ని చోట్ల బురదల్లో కూరుకుపోయి ఉండటం కూడా కనిపించాయి. ఎందుకూ కొరగాకుండా తయారయ్యాయి.
ఇప్పుడు ఆయా వాహనాలను శుభ్రం చేసుకున్నా పని చేయడం కష్టసాధ్యమైనపనే. ఇదొక ఆర్థిక భారంగా పరిణమించింది వాహనదారులకు. అదే సమయంలో వందల సంఖ్యలో ఆటోలు నీట మునగడం.. వాటి మీదే ఆధారపడి జీవనాన్ని కొనసాగించే డ్రైవర్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
విజయవాడ వరద ప్రాంతాలలో మురుగు, బురద చేరిన ఇళ్లను శుభ్రపరిచే బాధ్యతను కూడా ప్రభుత్వమే తీసుకుంటుందని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు ప్రకటించారు. ఫైర్ సర్వీసెస్ కు ఆ బాధ్యత అప్పగిస్తున్నామని ఆయన తెలిపారు.#VijayawadaFloods#APGovtWithFloodVictims#AndhraPradesh pic.twitter.com/ic0R0PP9jp
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) September 3, 2024
ఈ పరిస్థితుల్లో వాహనదారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చారు. బైక్లు, కార్లు, ఆటోలు, ఇలా వాహనాలన్నింటినీ శుభ్రం చేసే బాధ్యత కూడా తామే తీసుకుంటామని అన్నారు. వాటికి రిపేర్లు కూడా చేయించే బాధ్యత తమదేనని పేర్కొన్నారు.
ఆయా వాహనాల ఇన్సూరెన్సు క్లెయిమ్స్ సైతం 15 రోజుల్లో సెటిల్ అయ్యేలా బ్యాంకర్లు, ఇన్సూరెన్సు్ కంపెనీలతో మాట్లాడతామని చంద్రబాబు చెప్పారు. ఒకట్రెండు రోజుల్లో బ్యాంకర్లు, ఇన్సూరెన్స్ కంపెనీలతో సమావేశమౌతామని, వాటికి సంబంధించిన డాక్యుమెంట్లనూ ఇప్పిస్తామని అన్నారు.












Click it and Unblock the Notifications