చంద్రబాబుకు ఎప్పటికప్పుడు అప్‌డేట్
Godavari floods 2024: వారం రోజుల కిందట సంభవించిన భారీ వర్షాలు, వరదల వల్ల రెండు తెలుగు రాష్ట్రాలను అల్లకల్లోలానికి గురయ్యాయి. దారుణంగా దెబ్బతిన్నాయి. పలు ప్రాంతాలు నీట మునిగాయి. పల్లెలు, పట్టణాలు అనే తేడా ఉండట్లేదు. నదులు, చెరువులు ఏకం అయ్యాయి. జనావాసాలన్నీ జలమయం అయ్యాయి.
ప్రత్యేకించి- రాజధాని అమరావతి ప్రాంతం మొత్తం నీట మునిగింది. విజయవాడలో ఇదే పరిస్థితి నెలకొంది. సింగ్ నగర్, ఆంధ్రప్రభ కాలనీ, జక్కంపూడి, యనమలకుదురు, సితార సెంటర్, వాంబే కాలనీ, కబేళా సెంటర్, చిట్టినగర్, రాజరాజేశ్వరి పేట.. వంటి ప్రాంతాల్లో వరద నీరు తొలగిపోయింది. బురద ఇబ్బందులు తలెత్తాయి. ఆయా కాలనీల్లోని దాదాపు అన్ని ఇళ్లల్లో బురద పేరుకుపోయింది.

కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో వరద ఉధృతి నెలకొంది. వేలాదిమందిని ముంపు ప్రాంతాల నుంచి సురక్షిత ప్రదేశాలకు తరలించారు అధికారులు. విజయవాడ వరద ముంపునకు ప్రధాన కారణం బుడమేరు. దీనికి మూడు చోట్ల గండ్లు పడ్డాయి. మరో 16 చోట్ల చిన్న గండ్లు ఏర్పడ్డాయి.
ప్రస్తుతం గండ్ల పూడ్చివేత పనులు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయి. అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఈ పనులను పరిశీలించారు. ఇప్పటివరకు రెండు గండ్లను పూడ్చినట్టు ఆయన తెలిపారు. మూడో గండి పూడ్చివేత పనులు కొనసాగుతున్నాయి. ఈ పనులపై మంత్రి అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు.

అయిదు రోజులుగా జల వనరుల మంత్రిత్వ శాఖ అధికారులు గండ్ల పూడ్చివేత పనులను ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తోన్నారని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. నిద్రాహారాలు మాని పని చేస్తోన్నారని కితాబిచ్చారు. వారి కృషి వల్ల రెండు గండ్లు త్వరితగతిన పూడ్చివేసినట్లు చెప్పారు.
నిర్మాణ పనులకు సంబంధించిన పనులను ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఐటీ మంత్రి నారా లోకేష్‌కు అప్‌డేట్ చేస్తోన్నామని నిమ్మల వివరించారు. అధికారులకు తగిన ఆదేశాలను వారు జారీ చేస్తోన్నారని, మినిట్ టు మినిట్ గండ్ల పూడ్చివేత గురించి తెలుసుకుంటోన్నారని అన్నారు.












Click it and Unblock the Notifications