బెజవాడ దుర్గమ్మ లడ్డూ కల్తీ ? తనిఖీల్లో షాకులు-హైదరాబాద్ కు శాంపిల్స్...!
ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు కలిపిన వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తుండగా.. ఇప్పుడు విజయవాడ కనకదుర్గమ్మ దర్శనంలో ఇచ్చే లడ్డూ ప్రసాదంపైనా భక్తుల నుంచి భారీగా ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో తనిఖీలు చేపట్టిన అధికారులు ప్రాథమికంగా కొన్ని అంశాలు నిర్ధారించారు. తదుపరి పరీక్షల కోసం శాంపిల్స్ ను హైదరాబాద్ ల్యాబ్ కు పంపారు.

బెజవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మ ఆలయానికి కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఏటా కోట్లాది మంది భక్తులు దర్శనం చేసుకునేందుకు ఇక్కడికి వస్తుంటారు. ఆ సమయంలో ఇచ్చే లడ్డూ ప్రసాదం నాణ్యంగా ఉండటం లేదన్న ఫిర్యాదులు వస్తున్నాయి. దీనిపై ఇప్పటివరకూ మౌనంగా ఉంటూ వచ్చిన అధికారులు తిరుమలలో లడ్డూ వివాదం నేపథ్యంలో అలర్ట్ అయ్యారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు ఈ మేరకు బెజవాడ లడ్డూ ప్రసాదంపై దృష్టిసారించారు.
బెజవాడ దుర్గమ్మ లడ్డూ ప్రసాదంపై ఫుడ్ సేఫ్టీ అధికారులు జరిపిన తనిఖీల్లో ప్రాథమికంగా కొన్ని లోపాలు గుర్తించినట్లు తెలుస్తోంది. అయితే వీటి ఆధారంగా ఇప్పుడే ఓ నిర్ధారణకు రాలేమని వారు చెప్తున్నారు. దీంతో వారు గుర్తించిన లోపాలను నిర్ధారించుకునేందుకు హైదరాబాద్ ల్యాబ్ కు లడ్డూ శాంపిల్స్ ను పరీక్షలకు పంపారు. భక్తుల నుంచి భారీ ఎత్తున వస్తున్న ఫిర్యాదులతో లడ్డూ తయారీలో వాడుతున్న డ్రైఫ్రూట్స్ నాణ్యతగా లేవని నిర్ధారించిన అధికారులు.. నెయ్యి, ఇతర పదార్ధాల నాణ్యత నిర్ధారణ కోసం ల్యాబ్ కు పంపారు. అయితే ఈ రిపోర్టులు రావడానికి రెండు వారాలు పడుతుందని చెప్తున్నారు.












Click it and Unblock the Notifications