కేశినేని చిన్నికి కీలక పదవి.. అనూహ్యం
Kesineni Chinni: అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన విజయవాడ లోక్‌సభ సభ్యుడు కేశినేని చిన్నికి కీలక పదవి లభించింది. ప్రతిష్ఠాత్మక ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఆయన ఎన్నికయ్యారు. బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఏడాది పాటు ఈ హోదాలో కొనసాగుతారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలోని తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఇదివరకు ఉన్న పాత కమిటీ రాజీనామా చేసింది. ఫలితంగా కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకోవాల్సి వచ్చింది.

ఎన్నికల మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆధ్వర్యంలో ఆంధ్రా క్రికెట అసోసియేషన్ ఎన్నికలు జరిగాయి. ఈ సందర్భంగా కొత్త కార్యవర్గాన్ని అసోసియేషన్ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా కేశినేని చిన్ని ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కర్నూలు జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కూడా వ్యవహరిస్తోన్నారాయన.
సంయుక్త కార్యదర్శిగా భారతీయ జనతా పార్టీకి చెందిన విశాఖపట్నం నార్త్ శాసన సభ్యుడు విష్ణుకుమార్ రాజు ఎన్నికయ్యారు. కార్యదర్శిగా సానా సతీష్, ఉపాధ్యక్షుడిగా వెంకట ప్రశాంత్, కోశాధికారిగా డీ శ్రీనివాస్‌ను సభ్యులు ఎన్నుకున్నారు. ఆయా పదవుల కోసం వారు దాఖలు చేసిన ఆరు నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి పరిగణనలోకి తీసుకున్నారు. ఆంధ్రా క్రికెట్ అసోయేషన్ కొత్త కార్యవర్గం ఎన్నికను సెప్టెంబర్ 8వ తేదీన అధికారికంగా ప్రకటించనున్నారు.
రాజధాని అమరావతి పరిధిలో నిర్మితమౌతోన్న స్టేడియాన్ని వీలైనంత వేగంగా అందుబాటులోకి తీసుకుని వచ్చేలా కేశినేని చిన్ని చర్యలు తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్మాణంలో ఉన్న స్టేడియం ఇది.












Click it and Unblock the Notifications